జర్మనీ చర్చిలో నరమేధం.. కాల్పుల్లో పలువురి దుర్మరణం.. తీవ్ర హెచ్చరికలు జారీ

10 Mar, 2023 08:03 IST|Sakshi

బెర్లిన్‌: జర్మనీలో నరమేధం చోటు చేసుకుంది. గురువారం రాత్రి హాంబర్గ్‌లోని ఓ చర్చిలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణానికి కారకులు ఎవరు? కారణాలేంటన్నది తెలియాల్సి ఉంది. ఘటన నేపథ్యంలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు, స్థానికులను బయటికి రావొద్దని సూచించారు.
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హాంబర్గ్‌ యెహోవా  విట్‌నెస్‌ సెంటర్‌ అది. మూడు అంతస్థుల భవనం. మొదటి ఫ్లోర్‌ నుంచి తుపాకీ పేలిన శబ్ధం వినిపించిందంటూ విపత్తు హెచ్చరిక యాప్ ద్వారా అధికారులకు సమాచారం అందించారు ఎవరో. ఆ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. లోనికి ప్రవేశించేందుకు యత్నించారు. 

అయితే.. కింది ఫ్లోర్‌లో రక్తపు మడుగుల్లో కొందరు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని గమనించారు. వాళ్లలో కొందరు అప్పటికే ప్రాణం కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.  పైఫ్లోర్‌లో ఓ వ్యక్తి మృతదేహాం పడి ఉండడాన్ని గుర్తించారు. బహుశా ఆ వ్యక్తే కాల్పులకు పాల్పడి ఉంటాడని, ఘాతుకం అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

అయితే.. కాల్పులకు పాల్పడింది అతనేనా? లేదా ఆ దుండగుడు పరారీలో ఉన్నాడా? అసలు కాల్పులకు ఎందుకు పాల్పడ్డారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు జర్మనీ మీడియా సంస్థలు చనిపోయింది ఆరుగురే అని చెప్తుండగా.. పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. మరోవైపు హైఅలర్ట్‌ జారీ చేసిన పోలీసులు.. స్థానికులను బయటకు రావొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందాలని కోరారు.

ఇదిలా ఉంటే.. జిహాదీలు, స్థానిక అతివాద గ్రూపుల దాడులతో జర్మనీ గత కొన్నేళ్లుగా దాడులకు గురవుతోంది. ప్రముఖంగా చెప్పుకోవాలంటే.. డిసెంబర్‌ 2016లో బెర్లిన్‌లోని ఓ క్రిస్మస్‌ మార్కెట్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడగా.. 12 మంది మరణించారు. ఇక ఫిబ్రవరి 2020లో హనౌ నగరంలో అతివాద సంస్థ వ్యక్తి ఒకడు జరిపిన కాల్పుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు.

మరిన్ని వార్తలు