అఫ్గన్‌ ఆధిపత్య పోరు: తాలిబన్లతో పోరాటమా? లొంగుబాటా?

15 Aug, 2021 12:58 IST|Sakshi

సైన్యం నుంచి పోరు, ప్రతిఘటనలు లేకుండానే అఫ్ఘనిస్తాన్‌.. పూర్తిగా తాలిబన్‌ సంస్థ వశం అయ్యేలా కనిపిస్తోంది. దేశంలోని దాదాపు ప్రధాన పట్టణాలన్నీ ఆదివారం ఉదయం నాటికల్లా తాలిబన్ల స్వాధీనంలోకి వచ్చేశాయి. దీంతో ఏ క్షణమైనా తమ ఆధిపత్యాన్ని తాలిబన్లు ప్రకటించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఒక్క కాబూల్‌ మినహా దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోకి తాలిబన్‌ దళాలు చొచ్చుకెళ్లాయి. శనివారం మజర్‌–ఏ–షరీఫ్‌ను చుట్టుముట్టి బైకులు, వాహనాలపై పరేడ్‌ నిర్వహిస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు తాలిబన్లు. మజర్‌ను ఆక్రమించిన కొద్ది గంటలకే.. తూర్పు నగరం జలాలాబాద్‌ను స్వాధీనం చేసుకోవడం విశేషం. అఫ్గానిస్తాన్‌లోని 34 ప్రావిన్సుల్లో(రాష్ట్రాలు) 22 తాలిబన్ల అధీనంలోకి రాగా.. ఆదివారం ఉదయం కల్లా మరో నాలుగింటిని స్వాధీనం చేసుకున్నారు.

‘తెల్లారి చూసేసరికి తాలిబన్లు తెల్ల జెండాలను పాతారు. ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొకుండానే వాళ్లు ఊళ్లోకి ప్రవేశించారు’ అని జలాలాబాద్‌కు చెందిన ఓ స్థానికుడు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. శనివారం జాతిని ఉద్దేశించి ‘అఫ్గాన్ల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోం. ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే సహించం’ అంటూ గంభీర ప్రకటనలు చేసిన అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ.. సైన్యంలో ధైర్యం నింపడంలో మాత్రం ఘోరంగా విఫలం అవుతున్నాడు. 48 గంటల్లోగా రాజకీయ మార్గాల్లో పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు అష్రాఫ్‌ ప్రకటించడం, ఆపై కొన్ని గంటలకే  మజర్‌–ఏ–షరీఫ్‌, జలాలాబాద్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం విశేషం.

దీంతో తాలిబన్ల ఆక్రమణ  దాదాపు పూర్తి అయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక లొంగిపోవడమో లేదంటే హోరాహోరీగా పోరాడడమో అనే ఆప్షన్లు మాత్రమే అఫ్ఘన్‌ ప్రభుత్వం ముందు మిగిలాయని అంచనా వేస్తున్నారు.   ఇది చదవండి: సైన్యం-తాలిబన్ల ఘర్షణ, ఎలా మొదలైందంటే..

అమెరికా బలగాల పని
ఇదిలా ఉంటే తాలిబన్‌ దాడుల నేపథ్యంలో కాబూల్‌లోని రాయబార కార్యాలయ సిబ్బంది, సాధారణ పౌరుల తరలింపు కోసం సైన్యాన్ని రంగంలోకి దించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాదు తాలిబన్లకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారాయన. ఈ మేరకు ఇదివరకే భారీగా సైన్యం చేరుకోగా, మరికొంత మంది ఆదివారం రాత్రికల్లా చేరుకునే అకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాబూల్‌కి దక్షిణంగా  కేవలం 11 కి.మీ. దూరంలో ఉన్న చార్‌ అస్యాబ్‌ జిల్లా వరకు తాలిబన్లు వచ్చేశారని లోగర్‌ ప్రావిన్స్‌ చట్ట సభల ప్రతినిధి హోడా అహ్మది ప్రకటించేశాడు కూడా. మరోవైపు ఎటుచూసినా తాలిబన్లను ఎదుర్కొకుండా ఆయుధాలను-వాహనాలను అప్పగించేసి స్వచ్ఛందంగా లొంగిపోతోంది అఫ్గన్‌ సైన్యం.

1994లో అఫ్గన్‌ అంతర్యుద్ధంలో బలమైన విభాగంగా ఎదిగిన తాలిబన్లు.. 1996 నుంచి 2001 వరకు మిలిటరీ ఆర్గనైజేషన్‌గా ప్రకటించుకున్న తాలిబన్లు, అఫ్ఘనిస్థాన్‌లో అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. 9/11 దాడుల తర్వాత అమెరికా దళాలు తాలిబన్లను అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. అయితే తాజాగా అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న పరిణామాల తర్వాత 75వేల సభ్యులతో తాలిబన్‌ తిరిగి అఫ్ఘన్‌ ఆక్రమణకు తిరిగి ప్రయత్నించి.. లక్క్ష్యం నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
 

విష ప్రచారం
యువతులను బలవంతంగా తాలిబన్లకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తున్నారనే కథనాలను తాలిబన్‌ సంస్థ కొట్టిపడేసింది. ఇదంతా ఆఫ్ఘన్‌ ప్రభుత్వం చేస్తున్న విషపూరిత ప్రచారంగా పేర్కొంది. తాలిబన్‌ ప్రతినిధి సుహాలీ షాహీన్‌ ఈ మేరకు వరుస ట్వీట్లలో ఆ ఆరోపణలను ఖండించారు. నిరాధారమైన కథనాలతో కుట్రను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. మరోవైపు అమెరికా, భారత్‌ సహా ఏ దేశం అయినా సరే అఫ్గన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సహించలేదని తాలిబన్లు హెచ్చరించారు కూడా.

మరిన్ని వార్తలు