వెలుగులోకి మరో భూమి.. ఇదే తొలిసారి.. అచ్చంగా భూ గ్రహం మాదిరిగానే!

15 Jan, 2023 15:57 IST|Sakshi

వాషింగ్టన్‌: దాదాపుగా భూమి మాదిరిగానే ఉన్న ఒక గ్రహాన్ని జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తాజాగా గుర్తించింది. పైగా అది సరిగ్గా భూమి పరిమాణంలోనే ఉందట. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహాన్ని ఎల్‌హెచ్‌ఎస్‌ 475గా పిలుస్తున్నారు. ఇలా మన సౌరవ్యవస్థకు ఆవల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారంటూ నాసా సైంటిస్టులు సంబరపడుతున్నారు!

పైగా అది కూడా భూమి మాదిరిగానే రాళ్లు, పర్వతాలమయంగా ఉండటం మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని వారు చెబుతున్నారు. ఈ సోదర గ్రహంపై వాతావరణం ఉందో, లేదో, ఉంటే ఎలా ఉందో తేల్చే పనిలో పడ్డారు. అన్నట్టూ, ఇది తన సూర్యుని చుట్టూ కేవలం రెండు రోజులకు ఒక రౌండ్‌ చొప్పున వేసేస్తోందట! పైగా దానికి అతి సమీపంలో ఉందట. ‘‘కాకపోతే సదరు నక్షత్రపు ఉష్ణోగ్రత సూర్యునితో పోలిస్తే సగమే. కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌ 475పై వాతావరణం ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం’’ అని నాసా అంటోంది.

మరిన్ని వార్తలు