వరలక్ష్మి శరత్ కుమార్‌ గురించి ఎవరికీ తెలియని విషయాన్ని చెప్పిన డైరెక్టర్‌

23 Dec, 2023 06:47 IST|Sakshi

వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రశంసించని వారు ఉండరనే చెప్పాలి. ఆమె స్టార్‌ వారసురాలైనా ప్రతిభతోనే కథానాయకిగా రంగ ప్రవేశం చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ సూపర్‌ బెల్లీ డ్యాన్సరన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తన తండ్రి శరత్‌ కుమార్‌ సిఫార్సునే తీసుకోని ఆమె ప్రతిభనే నమ్ముకుని వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆమెను దర్శకుడు బాలా తనకు నచ్చిన నటి అని ప్రశంసించడం విశేషం.

సేతు, నందా, శివ పుత్రుడు వంటి పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు బాలా. ఈయన ప్రస్తుతం కోలీవుడ్‌లో వణంగాన్‌ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మొదట నటుడు సూర్య కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఆయన చిత్రం నుంచి వైదొలగడంతో నటుడు అరుణ్‌ విజయ్‌ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

దర్శకుడు బాలా ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ తాను చాలా తక్కువ మంది కథానాయకిలతోనే చిత్రాలు చేశానని, అందులో తనకు నచ్చిన నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు తెరకెక్కించిన తారై తప్పట్టై చిత్రం షూటింగ్‌లో ఘనంగా నటించిన ఆర్కే సురేష్‌కు నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌కు మధ్య జరిగిన సన్నివేశంలో ఆమె ఒంటి ఎముక చిట్లినా లెక్కచేయకుండా మళ్లీ మళ్లీ టేక్‌ చెప్పినా నటించారని చెప్పారు.

అసలు ఆర్కే సురేష్‌ ఆమైపె బలంగా పడాలన్నారు. షార్ట్‌ సరిగ్గా రావాలని తాను గట్టిగా అరవడంతో ఆర్కే సురేష్‌ ఆమైపె బలంగానే పడ్డారన్నారు. అలా తొలి షాట్‌ లోనే వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఒంటి ఎముక చిట్లిందన్నారు. ఆమె తనతో ఆ విషయాన్ని చెప్పలేదన్నారు. తాను పర్ఫెక్షన్‌ కోసం మరో రెండు మూడు టేకులు చేశానన్నారు. ఆమె కాదనకుండా నటించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నప్పుడు తన ఒంటి ఎముక చిట్లినదానికి సంబంధించిన ఎక్స్‌రేను చూపించడంతో ఇది నిజమా అని అడిగానన్నారు. దాంతో ఆమె నిజమేనని చెప్పి చాలా కష్టపడినట్లు చెప్పారన్నారు. అలా ఆమె కఠిన శ్రమజీవి అని దర్శకుడు బాలా పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు