భారత్‌కు శివాజీ ఆయుధం

2 Oct, 2023 05:19 IST|Sakshi

ముంబై–లండన్‌: ఛత్రపతి శివాజీకి పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లండన్‌ మ్యూజియంలో ఉన్న ఆయన ఆయుధాన్ని ప్రభుత్వం  వెనక్కి తీసుకురానుంది. 17వ శతాబ్దంలో శివాజీ వాడిన పులిగోళ్లు ఆకారంలో ఉండే ఆయుధాన్ని వెనక్కి తీసుకురావడానికి లండన్‌లోని విక్టోరియా అల్బర్ట్‌ మ్యూజియం, మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. 

ఇనుముతో తయారు చేసిన అత్యంత పదునైన  వాఘ్‌ నఖ్‌ (పులి గోళ్లు) ఆయుధాన్ని శివాజీ ఎక్కువగా వాడేవారు. ఆ ఆయుధాన్ని చేత్తో పట్టుకొని మహారాజా శివాజీ కదనరంగంలో స్వైరవిహారం చేస్తూ ఉంటే శత్రువులు గడగ డలాడిపోయేవారు. బీజాపూర్‌ సేనా నాయ కుడు అఫ్జల్‌ ఖాన్‌ను శివాజీ ఈ పులిగోళ్ల ఆయుధంతో చంపాడని చరిత్ర చెబుతోంది.

తెల్లదొరల పాలనా కాలంలో 1818లో ఈస్ట్‌ ఇండియాకు చెందిన అధికారి జేమ్స్‌ గ్రాండ్‌ డఫ్‌ పులి గోళ్ల ఆయుధాల సెట్‌ను విక్టోరియా అల్బర్ట్‌ మ్యూజియానికి ఇచ్చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత శివాజీ వాడిన ఆయుధం మన దేశానికి రానుంది. ఛత్రపతి శివాజీ పట్టాభి షిక్తుడై అక్టోబర్‌ 3నాటికి 350 ఏళ్లు పూర్తి కానున్నాయి. అదే రోజు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు.

మరిన్ని వార్తలు