కట్టుకున్న వారి కళ్లెదుటే..కానరాని లోకాలకు..

20 Nov, 2023 14:04 IST|Sakshi

పాణిగ్రహణం చేసిన వేళ.. జీవితాంతం తోడు, నీడగా నడుస్తామని చెప్పిన వారు.. తమ కళ్లెదుటే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి జీవిత భాగస్వాములు గుండెలు పగిలేలా కన్నీరు మున్నీరుగా రోదించారు. పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వివాహితలు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి.

పెంటపాడు: భర్త, ఇద్దరు పిల్లలతో కలసి బైక్‌పై వెళ్తూ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి కింద పడిన ఓ వివాహిత.. వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వై.జంక్షన్‌ సమీపాన ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన కుడుపూడి రాము, పుష్ప (27) ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు, మూడేళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. విజయవాడ వెళ్లేందుకు వీరు ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. అయితే తాడేపల్లిగూడెం నుంచి రిజర్వేషన్‌ దొరకడంతో అంబాజీపేట నుంచి భార్యా పిల్లలతో కలిసి రాము బైక్‌పై బయలుదేరాడు.

ప్రత్తిపాడు వద్దకు వచ్చేసరికి అకస్మాత్తుగా బైక్‌ అదుపు తప్పింది. దీంతో భార్య పుష్ప రోడ్డుపై పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు ముందు చక్రం ఆమె తలపై నుంచి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తల నుజ్జునుజ్జయి పుష్ప సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలైంది. అప్పటి వరకూ తనతో సరదాగా మాట్లాడిన భార్య కళ్లెదుటే విగతజీవిగా మారడంతో రాము ఆమె మృతదేహంపై పడి గుండెలవిసేలా విలపించాడు. తన కుమారులకు దిక్కెవరంటూ బోరున రోదించాడు. ఎస్సై హరికృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పుట్టింటికి వెళ్తూ.. మృత్యు ఒడికి..
తుని రూరల్‌: తల్లిని చూసేందుకు పుట్టింటికి బయలుదేరిన ఓ వివాహిత మార్గం మధ్యలోనే మృత్యు ఒడికి చేరిన విషాద సంఘటన ఇది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన కాలికురస విజయలక్ష్మి (30), తన భర్త ఆనంద్‌తో కలసి మోటార్‌ సైకిల్‌పై తుని మండలం దొండవాక గ్రామానికి శనివారం సాయంత్రం బయలుదేరింది. గ్రామంలో ఒంటరిగా ఉంటున్న తన తల్లి కాలక్షేపానికి పని చేస్తుందన్న ఉద్దేశంతో ఎల్‌ఈడీ టీవీ తీసుకువెళ్తున్నారు. ఆ టీవీని విజయలక్ష్మి పట్టుకుని మోటార్‌ సైకిల్‌పై భర్త వెనుక కూర్చుంది. మరో అరగంటలో తల్లి చెంతకు చేరుకునేదే.. అంతలోనే తుని మండలం చేపూరు సమీపాన పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై వెనుకే మృత్యుశకటంలా వచ్చిన కారు విజయలక్ష్మి చేతిని తాకుతూ దూసుకుపోయింది.

దీంతో మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి, దానిపై ఉన్న విజయలక్ష్మి, ఆనంద్‌ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో రోడ్డును బలంగా ఢీకొనడంతో విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తూండగానే భర్త ఒడిలో విజయలక్ష్మి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. విజయలక్ష్మిని పరీక్షించి మృతి చెందినట్టు నిర్ధారించారు. వీరిద్దరికీ వివాహమై మూడేళ్లయ్యింది. ఇంకా సంతానం లేరు. రూరల్‌ సీఐ సన్యాసిరావు సంఘటన స్థలానికి చేరుకుని విజయలక్ష్మి మృతదేహాన్ని, స్వల్పంగా గాయపడిన ఆనంద్‌ను 108లో తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు