మైనార్టీల ఓట్లెవరికో..?

2 Dec, 2023 10:37 IST|Sakshi

కరీంనగర్‌: కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల మైనార్టీ ఓట్లపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజక వర్గంలో మొత్తం 3,55,054 మంది ఓటర్లు ఉండగా అందులో 66 వేల పైచిలుకు మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా క్రిస్టియన్లు, సిక్కులు, ఇతరులు కలిపి మరో 12 వేల మంది వరకు ఉన్నారు. గురువారం జరిగిన పోలింగ్‌లో నియోజకవర్గంలో 3,55,054 ఓట్లకు 2,24,504 ఓట్లు పోలయ్యాయి.

ముస్లిం మైనార్టీలకు సంబంధించి 78 వేల ఓట్లల్లో 70 శాతం పోలైన 52 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని ఒక అంచనా. మైనార్టీలు ముస్లింల ఓట్లు ఒకే పార్టీకి పడే అవకాశం ఉండటంతో ఈ ఓట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో అన్న చర్చ హట్‌టాపిక్‌గా మారింది. ఓటు హక్కు వినియోగించుకున్న 52 వేల పైచిలుకు మందిలో ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేశారనే సందిగ్ధంలో అభ్యర్ధులు మల్లగుల్లాలు పడుతున్నారు. అంచనా ప్రకారం పోలైన 52 వేల ఓట్లల్లో 35వేల పైచిలుకు ఓట్లు బీఆర్‌ఎస్‌కే పడుతాయని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు.

మిగతా 17వేల ఓట్లు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు పడుతాయనే అంచనాల్లో మూడు పార్టీల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్లల్లో చేపట్టిన సంక్షేమ పథకాలు ముస్లిం మైనార్టీ వర్గాల్లో గడపగడపకూ అందాయని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలుపుతుండగా, కాంగ్రెస్‌ హాయంలోనే 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చామని ముస్లిం మైనార్టీలకు వెన్నుదన్నుగా నిలిచింది కాంగ్రెస్‌ పార్టీయేనని కాంగ్రెస్‌ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ముస్లిం ఓట్ల చీలికపై బీజేపీ ఆశలు పెంచుకుంది. త్రిపుల్‌ తలాక్‌తో పాటు బీజేపీ చేపట్టిన కార్యక్రమాలతో మైనార్టీల మద్దతు బీజేపీకి ఉందని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. దీంతో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజక వర్గం ఫలితం హట్‌టాపిక్‌గా మారింది,

మరిన్ని వార్తలు