వచ్చింది పోలీసులేనా? కిడ్నాప్‌ గ్యాంగ్‌ సభ్యులా? అస‌లేం జ‌రిగింది?

8 Dec, 2023 09:51 IST|Sakshi

ఒకరిని కారులో తీసుకెళ్లిన వ్యక్తులు!

ఇదేంటని అడిగిన మహిళపై..

సాక్షి, కరీంనగర్: సిద్దిపేట కమిషరేట్‌ పరిధిలోని దుబ్బాక ఠాణా పోలీసులమని కొందరు వ్యక్తులు సిరిసిల్లకు వచ్చి హల్‌చల్‌ చేశారు. అంతేకాదు ఓ దంపతులను బెదిరించారు. ఇదేంటని ప్రశ్నించగా.. వారి బైక్‌కు కారు అడ్డుపెట్టడంతో మహిళ చేయి విరిగింది. బాధితురాలు చికిత్స నిమిత్తం గురువారం సిరిసిల్ల ఆసుపత్రికొచ్చి తనకు జరిగిన అవమానాన్ని మీడియాకు వెల్లడించారు. పట్టణానికి చెందిన కవిత ఇంటికి కొందరు వచ్చారు. ఇంట్లో చొరబడి వెతుకుతుండగా ఆమె భర్త ఆ ఆగంతకులను నిలదీశారు.

తాము పోలీసులమని, కొడుకు దుబ్బాకలో ఓ గొడవలో నిందితుడని చెప్పారు. అతను ఎక్కడ ఉన్నాడో తెలపాలని బెదిరించారు. అదే సమయంలో పోలీసులని చెప్పిన వాళ్లు నానా బూతులు తిడుతూ కవిత భర్త ప్రయాణిస్తున్న బైక్‌కు కారు అడ్డుగా పెట్టడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ఈ సంఘటనలో కవిత చేయి విరిగింది. వచ్చిన ఆగంతకులు ఆమె భర్తను కారులో తీసుకెళ్లారు. ఆటో నడుపుకునే తన కొడుకు దుబ్బాకలో ఏదో కేసులో ఉన్నాడని బెదిరించారని రోదించింది.

ఈ విషయమై సిరిసిల్ల టౌన్‌ పోలీసులను వివరణ కోరగా కొందరు వచ్చి ఒకరి తీసుకెళ్లినట్లు సమాచారం కోసం పలువురు ఫోన్‌ చేశారని తెలిపారు. కానీ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పారు. ఒక జిల్లా పోలీసులు మరో జిల్లా పరిధిలోకి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తారని.. అలాంటి సమాచారం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. అసలు వచ్చింది పోలీసులేనా? ఎవరైన కిడ్నాప్‌ గ్యాంగ్‌ సభ్యులా? అని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఇవి చ‌ద‌వండి: క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణ‌యం!

>
మరిన్ని వార్తలు