సీతారామ.. ఇదేం ఖర్మ?

18 Mar, 2023 00:40 IST|Sakshi
నత్తనడకన సాగుతున్న సీతమ్మసాగర్‌ బ్యారేజీ పనులు
కాళేశ్వరం కంటే ముందే పనులు ప్రారంభం
● ఏడేళ్లలో రూ.6వేల కోట్లకు పైగా వ్యయం ● అయినా ఒక్క ఎకరాకూ నీరందని వైనం ● ఫైనల్‌ డీపీఆర్‌ ఖరారులో జాప్యం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పనులు ప్రారంభించి ఏడేళ్లు.. నిర్మాణ పనుల కోసం ఇప్పటి వరకు వెచ్చించింది రూ.6వేల కోట్లకు పైగానే. కానీ నేటికీ కనీసం ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోతోంది సీతారామా ప్రాజెక్ట్‌. గోదావరి నీళ్లు ఎప్పుడు పొలాల్లోకి పారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.

కాళేశ్వరానికి మూడునెలల ముందే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందులో భాగంగా 2016 ఫిబ్రవరిలో సీతారామా, మేలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. మూడు నెలలు ఆలస్యంగా చేపట్టినా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వడివడిగా సాగాయి. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల నిర్మాణాలు కేవలం మూడేళ్ల వ్యవధిలోనే పూర్తయ్యాయి. 2019 జూన్‌ 21న అంగరంగ వైభవంగా ఈ ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. మరోవైపు సీతారామ ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు.. అన్నట్టుగా సాగుతున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభమై ఏడేళ్లు దాటినా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది.

డీపీఆర్‌కు ఏడేళ్లు..

సీతారామ ప్రాజెక్టు డిజైన్లు ఖరారు చేయడంలో సాగునీటి శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ఆపసోపాలు పడింది. ముందుగా ఖరారు చేసిన డీపీఆర్‌లో టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద భారీ రిజర్వాయర్‌ నిర్మించాల్సి ఉంది. దీంతో 2016 ఫిబ్రవరి 16న అక్కడే ప్రాజెక్టు పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. రెండేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత రిజర్వ్‌ ఫారెస్ట్‌, కిన్నెరసాని అభయారణ్యం, రైల్వే ట్రాక్‌లతో ఇబ్బంది ఉండొద్దంటూ రీ డిజైన్‌ చేస్తూ మరో డీపీఆర్‌ సిద్ధం చేశారు. దీంతో కీలకం అనుకున్న రోళ్లపాడు రిజర్వాయర్‌ ‘సీతారామ’లో చోటు కోల్పోయింది. ఇలా అనేక సార్లు డీపీఆర్‌ మారుతూ వచ్చింది. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 14న నీటి పారుదల శాఖ అధికారులు కేంద్ర జల సంఘానికి ఫైనల్‌ డీపీఆర్‌ను సమర్పించారు.

సాగుతున్న భూసేకరణ

సీతారామ ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణం, ఫ్లడ్‌బ్యాంక్‌లు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, పంప్‌హౌజ్‌లకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఏడేళ్లు దాటినా ఇంకా కొలిక్కి రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంకా 500 ఎకరాలకు పైగా భూమి సేకరించాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో 1,717 ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 888 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఇది కాకుండా ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి మార్చిన డిజైన్‌ ప్రకారం ఎంత భూమి సేకరించాలనే అంశంపై స్పష్టత లేదు. సీతారామా ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలంటూ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన మేర పురోగతి లేదు. దీంతో పొలాలకు నీరందించే పంట కాల్వల నిర్మాణ పనులు ఆగుతూ.. సాగుతూ అసంపూర్తిగా ఉన్నాయి.

కాల్వల నిర్మాణంలోనూ జాప్యమే..

రాష్ట్రంలో ఏ సాగునీటి ప్రాజెక్టుకూ లేని అనేక సానుకూల అంశాలు ‘సీతారామ’కు ఉన్నాయి. పొలాలకు నీరందించే పంట కాల్వల నిర్మాణం త్వరితగతిన చేపడితే కొత్త బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకపోయినా బ్రిటీషర్లు కట్టిన పాత ఆనకట్టలో నిల్వ ఉన్న నీటిని పొలాలకు మళ్లించే వీలు ఉండేది. కానీ బ్యారేజీ నిర్మాణ ప్రదేశం నుంచి సుమారు 70 కిలోమీటర్ల వరకు చుక్క నీరు పొలాలకు వదిలే వీలు లేకుండా కాల్వలు డిజైన్‌ చేశారు. ఏడేళ్లయినా ఫస్ట్‌ ఫేస్‌లోని 70 కిలోమీటర్ల కాల్వ నిర్మాణమే నేటికీ పూర్తి కాలేదు. దీంతో గోదావరి నీరు ఎత్తి పోసేందుకు ఏడాది కిందటే అందుబాటులోకి వచ్చిన బీజీ కొత్తూరు, వీకే రామవరం, కమలాపురం పంప్‌ హౌస్‌లను ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది.

రూ.వేల కోట్లు వెచ్చించినా..

సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి అంచనా వ్యయం రూ.13,065 కోట్లు. గడిచిన ఏడేళ్ల కాలంలో భూసేకరణ, పంప్‌హౌస్‌లు, పంట కాల్వలు, బ్యారేజీ నిర్మాణం తదితర పనులకు సుమారు రూ.6,500 కోట్లు ఖర్చయ్యాయి. కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీరందలేదు. పైగా ఏడేళ్ల కాలంలో సవరించిన డీపీఆర్‌లు, హైడల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ చేర్పు తదితర కారణాలతో అంచనా వ్యయం రూ.13,065 కోట్ల నుంచి రూ.18,900 కోట్లకు చేరుకుంది.

మరిన్ని వార్తలు