కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే.. : ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

11 Nov, 2023 12:17 IST|Sakshi
మాట్లాడుతున్న బండి సంజయ్‌, పక్కన పాల్వాయి హరీశ్‌బాబు, తదితరులు

ఎంపీ బండి సంజయ్‌

సిర్పూర్‌లో అభివృద్ధి శూన్యం : బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు!

సాక్షి, కుమరం భీం: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సిర్పూర్‌(టి)లో శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబుకు మద్దతుగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలించినా కోనప్ప ఎందుకు అడ్డుపడలేదని ప్రశ్నించారు.

సత్తా కలిగిన నాయకుడు పాల్వాయికి ఈసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. పోడు రైతుల పక్షాన జైలుకు వెళ్లిన హరీశ్‌బాబుకు వైద్యం అందించకుండా జైలులోనే చంపేకుట్ర చేశారని ఆరోపించారు. వెయ్యేళ్ల చరిత్ర గల గోండు రాజుల కోటను మసీ దు కోసం ఆక్రమించడం దారుణమన్నారు. సిర్పూర్‌లో కాషాయ జెండా ఎగరవేసి రాజుల కోటను పునరుద్ధరించి పూజలు ప్రారంభిస్తామన్నారు.

యూపీలో చెల్లని బీఎస్పీ.. ఇక్కడ చెల్లదు!
యూపీలో చెల్లని బీఎస్పీ జెండా.. తెలంగాణలో చెల్లుతుందా..? ఆలంపూర్‌లో చెల్లని రూపాయి సిర్పూర్‌లో చెల్లుతుందా..? అని సిర్పూర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి హరీశ్‌బాబు ఎద్దేవా చేశారు. 15 ఏళ్లు పాలించిన కోనప్ప హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఇప్పటికీ సిర్పూర్‌లో బస్టాండ్‌ లేకపోవడం సిగ్గు చేటన్నారు. ఆంధ్ర ముసలి ఎద్దుకు విశ్రాంతి ఇవ్వాలని.. ఈ బెజ్జూర్‌ కోడలేగకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పీపీరావు వారసుడు, స్థానికుడైన హరీశ్‌బాబును ప్రజలు ఆశీర్వాదించాలని కోరారు. అంతకు ముందు భారీ రోడ్‌షో నిర్వహించారు. బీజేపీలో చేరిన వారికి బండి సజయ్‌ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే భారీ క్రేన్‌తో ఆయనకు అభిమానులు భారీ పూలమాల వేశారు. ఈ సభలో జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: అట్టహాసంగా సంజీవ్‌రెడ్డి నామినేషన్‌..

మరిన్ని వార్తలు