నిండు ప్రాణాన్ని బలితీసుకున్న జనసైనికుల అత్యుత్సాహం

16 Mar, 2023 01:00 IST|Sakshi

కృష్ణా: జనసైనికుల అత్యుత్సా హం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ర్యాలీ పేరుతో చేసిన హడావుడి రోడ్డు ప్రమాదానికి దారితీయటంతో ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. సేకరించిన వివరాల మేరకు.. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంకకు చెందిన చందన ఆంజనేయులు (48) ఈ నెల 14న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ర్యాలీని వీక్షించేందుకు కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు ప్రధాన సెంటరుకు వచ్చాడు.

అప్పటికే సెంటరు పూర్తిగా జనసేన నేతలు, కార్యకర్తలతో నిండిపోయింది. కొందరు జనసేన యువత బైక్‌లపై రయ్యమంటూ దూసుకుపోతూ హల్‌చల్‌ చేస్తున్న సమయంలో జాతీయ రహదారిపై ఉన్న డివైడరు దిగి రోడ్డు దాటేందుకు ఆంజనేయులు ప్రయత్నించగా విజయవాడ వైపు నుంచి కంకిపాడు వస్తున్న జనసేన కార్యకర్తల బైక్‌ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు తీవ్రంగా గా యపడ్డాడు. వెంటనే ఆయ న్ను ప్రత్యేక వాహనంలో స మీప ఆస్పత్రికి తరలించారు.

మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం ఆంజనేయులు మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్క డకు వెళ్లి వివరాలను సేకరించారు. మృతుడి కుమారుడు చందన శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె.సుధాకర్‌ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్‌ను ఘటనాస్థలంలోనే విడిచిపెట్టి జనసేన కార్యకర్తలు పారిపోవడంతో పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బైక్‌ నంబరు ఆధారంగా ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు