నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న నలుగురి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లను చలామణీ చేస్తున్న నలుగురి అరెస్ట్‌

Published Sun, Nov 12 2023 1:46 AM

-

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నలుగురిని వన్‌టౌన్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. నకలీ నోట్లు చెలమణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను, వారికి వాటిని తయారు చేసి సరఫరా చేస్తున్న మరో వ్యక్తి పోలీసులు అరెస్ట్‌ చేసిన వారిలో ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఏడో తేదీ కాళేశ్వరరావు మార్కెట్‌లో ఒక మహిళ కిలో ఉల్లిపాయ కొనుగోలు చేసి వంద రూపాయల నోటును దుకాణ యజమాని బాలజంగం రంగనాథ్‌కు అందించింది. అతను దాన్ని పరిశీలించి నకిలీ నోటుగా గుర్తించి పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు ఆమెను విచారణ చేయగా గొల్లపూడికి చెందిన తాతినేని వనజాక్షిగా గుర్తించారు. ఆమెకు రూ.100, రూ.50 నోట్లను అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన షేక్‌ బాజీ ఇచ్చినట్లు వివరించింది. దాంతో షేక్‌ బాజీని అతని నుంచి తీసుకొని నోట్లు చలామణి చేస్తున్న కంకిపాడు మండలానికి చెందిన షేక్‌ పకీరా, పెనమలూరు మండలానికి చెందిన షేక్‌ మీరావలిని సైతం అదుపులోకి తీసుకొని సీఐ సురేష్‌రెడ్డి విచారణ చేశారు. దీనిలో షేక్‌ బాజీ తన వద్ద ఉన్న ప్రింటర్‌ సాయంతో నోట్లను తయారు చేసి మిగిలిన ముగ్గురికి ఇచ్చి రద్దీగా ఉండే సమయంలో, దుకాణాలు మూసివేసే సమయాల్లో వాటిని చలామణి చేసే విధంగా వ్యవహరించేవారన్నారు. ఆ నలుగురిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.33,040 నకిలీ కరెన్సీ, రూ.2,86,060 తయారీలో ఉన్న నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement