ఉద్యోగం పేరుతో మోసం

5 Sep, 2023 09:00 IST|Sakshi
స్పందనలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న అడ్మిన్‌ అడిషనల్‌ ఎస్పీ టి.సర్కార్‌

కర్నూలు(టౌన్‌): దివ్యాంగుల కోటా కింద కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తామని ఆదోని పట్టణానికి చెందిన వ్యక్తి డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఏఎస్పీ అడ్మిన్‌ టి.సర్కార్‌కు పెద్దకడుబూరు మండలం దొడ్డిమేకల గ్రామానికి చెందిన నాగరాజు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 85 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులన్నిటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని అడిషనల్‌ ఎస్పీ హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, సీఐలు పాల్గొన్నారు.

స్పందనకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని...

► తమ పొలంలో అక్రమంగా కాల్వ తవ్వి నీరు నిల్వ ఉండే విధంగా చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చిప్పగిరి మండలం ఖాజీపురం గ్రామానికి చెందిన మాదేవమ్మ ఫిర్యాదు చేశారు.

► తన ఫేస్‌బుక్‌కు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99కే ఇయర్‌ బడ్స్‌ ఆఫర్‌ ఉందని లింక్‌ వచ్చిందని, లింక్‌ను క్లిక్‌ చేసి బ్యాంక్‌ ఓటీపీ ఎంటర్‌ చేయగానే తన ఖాతా నుంచి రూ.18,400 నో బ్రోకరేజ్‌ కింద కట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చిందని కర్నూలుకు చెందిన మల్లికార్జున వాపోయారు. తనకు న్యాయం చేయాలని విన్నవించారు.

► మొత్తం 28 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన కమీషన్‌ ఏజెంట్‌, లారీ డ్రైవర్లు 19 క్వింటాళ్లు మాత్రమే ఉందని మోసం చేస్తున్నట్లు నాగలాపురానికి చెందిన సత్యనారాయణ చౌదరి ఫిర్యాదు చేశారు.

► తమకున్న నాలుగు ఎకరాల పొలాన్ని తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దౌర్జన్యంగా లాక్కున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పత్తికొండకు చెందిన శాంతకుమారి ఫిర్యాదు చేశారు.

► తన పొలాన్ని కౌలుకు తీసుకున్న వ్యక్తి అక్రమంగా ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుని పాస్‌బుక్‌ కూడా తీసుకున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని నన్నూరు గ్రామానికి చెందిన ఖాజా మియా ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు