Sakshi News home page

No Headline

Published Sun, Nov 12 2023 1:34 AM

- - Sakshi

ఉదారంగా రుణాలు

పంపిణీ చేస్తున్న బ్యాంకులు

వార్షిక రుణ ప్రణాళిక అమలులో

గణనీయమైన పురోగతి

ఖరీఫ్‌లో లక్ష్యానికి మించి

పంట రుణాల పంపిణీ

ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపనకు

విరివిగా రుణాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): రైతులు పంట రుణాల కోసం, పొదుపు మహిళలు లింకేజీ రుణాల కోసం గతంలో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ ఫలితం ఉండేది కాదు. బ్యాంకులు రుణాలు ఇవ్వక, ప్రభుత్వం పట్టించుకోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టీడీపీ హయాంలో రైతులు పంట రుణాల కోసం రోడ్డెక్కే దుస్థితి ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రుణాలు విరివిగా లభిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీతో సమావేశమవుతూ... పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుండటంతో బ్యాంకులు కూడా రుణాల పంపిణీలో ఉదారంగానే వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది( 2023–23) రుణ ప్రణాళిక అమలులో గణనీయమైన ప్రగతి కనిపించింది. మొదటి ఆరు నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళికలో 66.99 శాతం అమలైంది.

రూ.8,253 కోట్ల రుణాలు

జిల్లాలో 34 బ్యాంకులు ఉండగా వాటికి 277 శాఖలు(బ్రాంచీలు) ఉన్నాయి. రూరల్‌లో 77, సెమీఅర్బన్‌లో 42, అర్బన్‌లో 158 బ్యాంకుల బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రణాళిక ప్రకారం రుణాలు పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది రూ.12,320.64 కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం. మొదటి ఆరు నెలల్లో రూ.8,253.86 కోట్ల రుణాలు (66.99 శాతం) పంపిణీ చేశారు. జిల్లా మొత్తంగా అన్ని బ్యాంకుల్లో వివిధ వర్గాల ప్రజలకు సంబంధించిన డిపాజిట్‌లు రూ.14,626.75 కోట్లు ఉన్నాయి. అయితే అడ్వా న్స్‌లు(రుణాలు) మాత్రం రూ.22,131,05 కోట్లు ఉన్నాయి. డిపాజిట్‌ల కంటే అడ్వాన్స్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాంకులు వివిధ రూపాల్లో నిధులు సమకూర్చుకొని రుణాలు పంపిణీ చేస్తున్నాయి.

ఖరీఫ్‌లో లక్ష్యానికి మించి..

వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఈ ఏడాది రూ.6,792.1 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం ఉండగా.. మొదటి ఆరు నెలల్లో రూ.4,656.3 కోట్లు ఇచ్చారు. ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష్యాన్ని మించి పంట రుణాలు పంపిణీ చేశారు. ఖరీఫ్‌ పంట రుణాల లక్ష్యం రూ.2,926.01 కోట్లు ఉండగా 2,31,731 మంది రైతులకు రూ.3,312.89 కోట్లు పంపిణీ చేశారు. సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారులకు కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చారు. వ్యవసాయ టర్మ్‌రుణాలు, వ్యవసాయ అనుబంధ రుణాల పంపిణీ లక్ష్యం రూ.1,482.93కోట్లు ఉండగా...రూ.968.42 కోట్లు పంపిణీ చేశారు.

పరిశ్రమల ఏర్పాటుకు..

ప్రభుత్వం సూక్ష్మ(మైక్రో), సూక్ష్మ(స్మాల్‌), మధ్య( మీడియం) తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేయిస్తోంది. 2023–24లో 36,994 మందికి ఎంఎస్‌ఎంఈ రుణాల కింద రూ.2,082.59 కోట్ల రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. మొదటి ఆరు నెలల్లో 18,490 మందికి రూ.1,429.5 కోట్లు పంపిణీ చేయడం విశేషం. ఎంఎస్‌ఎంఈ రుణాల పంపిణీలో 68.64 శాతం పురోగతి కనిపించింది.

చిరు వ్యాపారులకు..

పీఎంఈజీపీ కింద పెద్ద ఎత్తున రుణాలు పంపిణీ జరుగుతోంది. జగనన్న తోడు కింద చిరు, వీధి వ్యాపారులకు రుణాలు అందిస్తున్నారు. ఈ ఏడాది డీఆర్‌డీఏ–వైకేపీ ద్వారా 11,999 మందికి, మెప్మా ద్వారా 7,646 మందికి రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించి.. ఈ దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ కింద ఏర్పాటు చేసే సోలార్‌ డ్రైయర్లు, ఇతర పరిశ్రమలకు బ్యాంకులు ఇతోదికంగా రుణాలు ఇస్తున్నాయి.

పొదుపు మహిళలకు..

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు పిలిచి రుణాలు ఇస్తున్నాయి. డీఆర్‌డీఏ–వైకేపీ ఆధ్వర్యంలోని 21,209 సంఘాలకు రూ.697 కోట్లు రుణాలు పంపిణీ చేయాలనేది లక్ష్యం. అయితే సెప్టెంబరు నెల చివరి వరకు 65,886 సంఘాలకు రూ.365 కోట్లు రుణాలు పంపిణీ చేశారు. అర్బన్‌ ప్రాంతాల్లో 1,313 సంఘాలకు రూ.119.79 కోట్లు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. చేనేత–జౌళి శాఖ ద్వారా చేనేతకార్మికులకు ముద్రా రుణాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ చేశారు.

లక్ష్యాలను అధిగమించే

దిశగా చర్యలు

2023–24 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గత ఏడాదితో పోలిస్తే 2023–24లో రుణాల పంపిణీ ఆశాజనకంగా ఉంది. వ్యవసాయ రంగంలో మంచి ప్రగతి ఉంది. ఎంఎస్‌ఎంఈ రుణాల పంపిణీ కూడా మెరుగ్గా ఉంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు, చేనేతకార్మికులుకు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయి.

– రామచంద్రరావు, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌, కర్నూలు

పంట పండించాలన్నా.. పరిశ్రమ స్థాపించాలన్నా.. జీనోపాధి మెరుగు పరచుకోవాలన్నా.. గతంలో ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయించి అధిక వడ్డీకి అప్పులు తీసుకోవాల్సి వచ్చేది. నేడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రైతులకు, పొదుపు మహిళలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయి. వార్షిక రుణ ప్రణాళికను బ్యాంకర్లు పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement