చిక్కిన చిరుత.. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు

16 Oct, 2023 11:36 IST|Sakshi
బొలెరొ వాహనంలో చిరుతను దించుతున్న క్రెన్‌

మహబూబ్‌నగర్‌: రెండేళ్ల నుంచి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో శనివారం రాత్రి చిక్కింది. రెండు నెలల నుంచి మరికల్‌ మండలం రాకొండ శివారులోని గుట్టపై ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనించి అక్కడే ఉంటుంది. నిత్యం రాత్రి కాగానే వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపై ఎక్కడో ఒక చోట దాడి చేసి ఆకలి తీర్చుకుంటుంది.

చిరుత పులిని పట్టుకోవాలని పది రోజుల కిందట గ్రామస్తులు నారాయణపేట అటవీ శాఖ అధికారులను సంప్రందించారు. మూడు రోజుల కిందట రాకొండ గుట్ట సమీపంలో బోనులో మేకపిల్లను ఉంచి చిరుతను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు తల్లి చిరుత బోనులో చిక్కడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆదివారం మేకపిల్లను బయటకు పంపించి క్రేన్‌ సాయంతో బొలెరొ వాహనంలో శ్రీశైలం అడవిలోకి తరలించారు.

బోనులో చిక్కిన చిరుత మండలంలో రాకొండ, పూసల్‌పహాడ్‌, మాద్వార్‌ తదితర గ్రామాల్లోని పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఈ చిరుతకు సంబంధించిన రెండు చిరుత పిల్లలు తప్పించుకోవడంతో వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారి వీణావాణి తెలియజేశారు.

అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
పట్టుబడిన చిరుతను ఆదివారం అటవీ శాఖ వారు బోనులో బంధించి నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం గిరిజ గుండాల బేస్‌ క్యాంపు సమీపంలో అడవిలోకి వదిలిపెట్టారు.

మరిన్ని వార్తలు