అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!

10 Nov, 2023 09:48 IST|Sakshi

కాటేసిన కరెంట్‌

అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్‌ కంచె ఏర్పాటు

షాక్‌కు గురై ఇద్దరు రైతుల మృతి

రుక్కన్నపల్లి, సోళీపురం గ్రామాల్లో విషాదం

మహబూబ్‌నగర్‌: అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైరు తగిలి షాక్‌తో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రుక్కన్నపల్లి శివారులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రుక్కన్నపల్లితండాకు చెందిన రాములునాయక్‌(37) రుక్కన్నపల్లి, కోతులకుంట తండాల శివారులో ఐదున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు.

ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తుండటంతో కొన్నిరోజుల నుంచి చుట్టూ విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసి రాములు అత్తగారి ఇంటి నుంచి కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. గురువారం రాత్రి అతనికి తోడుగా సోళీపురం గ్రామానికి చెందిన జాలికాడి నర్సింహులు(45)ను పిలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో ప్రతిరోజు మాదిరిగానే రాములునాయక్‌ భార్య శారద ఇంటి దగ్గర కరెంట్‌ ఆన్‌ చేయడానికి తన భర్తను అడిగేందుకు ఫోన్‌లో చేసింది. అయితే అప్పటికే ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని వచ్చింది.

దీంతో ప్రతిరోజు లాగే గురువారం సైతం కరెంట్‌ ఆన్‌ చేసింది. ఈ విషయం తెలియని రాములునాయక్‌, జాలికాడి నర్సింహులు ఇద్దరూ వరి చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్‌ తీగలు తగలడంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత అటుగా వెళ్లిన ఇతర పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులతోపాటు రెండు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అర గంట ముందు వరకు కళ్ల మందు ఉన్న వ్యక్తులు అంతలోనే విగతజీవులుగా మారడంతో బోరుమని విలపించారు. రాములు నాయక్‌కు భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. నర్సింహకు భార్య బొజ్జమ్మతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

మరిన్ని వార్తలు