నామినేటెడ్‌పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!

17 Dec, 2023 12:31 IST|Sakshi

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పదవులపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు

ఇటీవల కార్పొరేషన్‌ చైర్మన్ల రద్దుతోపెరిగిన ఆశావహుల ప్రయత్నాలు

ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికిరాజీనామా చేసిన కసిరెడ్డి

టికెట్‌ త్యాగానికి ప్రతిగా ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్న పలువురు నేతలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ నామినేటెడ్‌ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్‌ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్‌ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు.

రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌పదవులపై ఆశలు..
గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలకు కార్పొరేషన్‌ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్‌ కో ఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వేద సాయిచంద్‌ సతీమణి రజని, ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్‌, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మహమ్మద్‌ ఇంతియాజ్‌ ఇసాక్‌, మిషన్‌ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌ గుప్తా, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రమావత్‌ వాల్యానాయక్‌, టూరిజం డెవలప్‌మెంట్‌ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్‌ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు.

ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా..
మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సీనియర్‌ నేతలు, పార్టీ టికెట్‌ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్‌ చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్‌ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది.
ఇవి చ‌ద‌వండి: ప్ర‌భుత్వాల‌ మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమ‌లుపై అత‌లాకుతలం!

>
మరిన్ని వార్తలు