విదేశీవిద్యనుఅందిపుచ్చుకోవాలి | Sakshi
Sakshi News home page

విదేశీవిద్యనుఅందిపుచ్చుకోవాలి

Published Sun, Dec 17 2023 10:16 AM

- - Sakshi

వనపర్తిటౌన్‌: తెలుగు యువత అమెరికాలో విద్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన మార్గనిర్ధేశం చేస్తామని అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అధ్యక్షుడు జయంత్‌ తెలిపారు. అమెరికాలో విద్యావకాశాలు, మెరుగైన యూనివర్సిటీలు, స్కాలర్‌షిప్‌ అందించే వివరాలు తెలుసుకునేందుకు ఆటా మెయిల్‌ ఐడీని సంప్రదించాలని సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలో డౠ్ల్యసీసీఎం డిగ్రీ కళాశాల, ఆటా సంయుక్తంగా నిర్వహించిన ఎడ్యుకేషన్‌ సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విదేశాల్లో తెలుగువారు ఎందరో ప్రతిభ చాటి ప్రపంచానికే దేశం సత్తా చాటారని.. అందులో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెండ్ల ఉన్నారని గుర్తు చేశారు. కొత్త ఆలోచనలు అలవర్చుకొని విద్య, అక్షరాస్యత, వ్యాపార అభివృద్ధిలో తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్లినా అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతోనే ఆటా కొన్నేళ్లుగా విస్తృత పర్యటనలు చేస్తూ అమెరికా అంటే నెలకొన్న భయాందోళనను తొలగిస్తుందన్నారు. యువత ప్రపంచ దేశాల్లో రాణిస్తూనే దేశానికి తోడ్పాటునందించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సామగ్రిని ఆటా అందిస్తుందని తెలిపారు. అనంతరం అమెరికాలో విద్యా విధానం, మెరుగైన యూనివర్సిటీలు, అక్కడ లభించే ఉపాధి అవకాశాలు తదితర వాటి గురించి ప్రొజెక్టర్‌పై విద్యార్థులకు వివరించారు. ఆటా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, కార్యదర్శి సతీష్‌రెడ్డి, కోశాధికారి వేణుగోపాల్‌, డీఐఈఓ జాకీర్‌ హుస్సేన్‌, అధ్యాపకులు వినోద్‌కుమార్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సైదులు, శ్రీధర్‌, జోత్స్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement