Abdul Razzaq: ఐశ్వర్య రాయ్‌పై రజాక్‌ అసభ్యకరమైన మాటలు.. ఫైర్‌ అవుతున్న ఇండియన్స్‌

15 Nov, 2023 08:07 IST|Sakshi

భారత్‌లో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌- 2023 జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు సెమీస్‌లో భారత్‌ Vs న్యూజిలాండ్‌ మధ్య పోరు జరగనుంది. ఈ మెగా టోర్నీలో లీగ్‌ స్టేజ్‌లో కేవలం నాగుగు విజయాలను మాత్రమే నమోదుచేసిన పాకిస్తాన్‌ ఇంటిముఖం పట్టింది. ఈ వరల్డ్‌ కప్‌లో భారత్‌ చేతిలో పాక్‌ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ ఓటములను పాక్‌ అభిమానులతో పాటు ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇండియన్‌ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్‌ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి.

ఓ ఓపెన్ డిబేట్‌లో మాజీ క్రికెటర్లు ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిదిలతో కలిసి రజాక్ మాట్లాడాడు. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌ పట్ల చెత్త వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. అబ్దుల్ రజాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ' ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే' అంటూ హద్దులు దాటాడు .

రజాక్ నోటి వెంట ఒక్కసారిగా ఐశ్వర్య రాయ్‌ పేరు రావడంతో మొదట షాక్ తిన్న షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత నవ్వుతూ చప్పట్లు కొట్టడం గమనార్హం. రజాక్‌తో పాటు గుల్, అఫ్రిదిల తీరుపై భారత అభిమానులు భగ్గుమంటున్నారు. మీ దేశం నేర్పిన సంస్కారం ఇదేనా అంటూ ఫైర్‌ అవుతున్నారు. ఒక స్త్రీ పట్ల ఇలా మాట్లాడటం సిగ్గు చేటని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఐశ్వర్య రాయ్‌ ఇంట్లో బాత్‌రూమ్‌లు క్లీన్‌ చేయడానికి కూడా పనికిరావు అంటూ రజాక్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

క్షమాపణలు కోరిన అబ్దుల్‌ రజాక్‌
భారతీయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో  తన సోషల్ మీడియా ద్వారా ఐశ్వర్య రాయ్‌కు అబ్దుల్‌ రజాక్ క్షమాపణలు చెప్పాడు. 'ఆ సమయలో నేను క్రికెట్ గురించి మాట్లాడుతున్నాను. క్రికెట్‌కు సంబంధించిన ఉదాహరణను ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో అనుకోకుండా నోరు జారి ఐశ్వర్య రాయ్ పేరు తీసుకున్నాను. అది నా ఉద్దేశ్యం కాదు. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను.' అని రజాక్ అన్నారు.

వివరణ ఇచ్చిన షాహిద్ అఫ్రిది
ఐశ్వర్య రాయ్‌ గురించి రజాక్ వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ నవ్వారని ఆ సమయంలో తాను నవ్వానని చెప్పాడు. కానీ రజాక్‌ మాటలు తనకు ఆ సమయంలో అర్థం కాలేదని షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. 'ఆ సమయంలో అందరూ నవ్వుతున్నారు. ఆ మాటలు నేను గమనించలేదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత, రజాక్  మాటలను నాకు షేర్‌ చేశారు. ఆ వీడియో క్లిప్‌ను మళ్లీ విన్నాను. అప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించింది. నేను వెంటనే రజాక్‌తో మాట్లాడి.. క్షమాపణ చెప్పమని కోరడం జరిగింది. ఎందుకంటే అలాంటి వ్యాఖ్య ఎవరి గురించి చేయకూడదు.' అని అఫ్రిది అన్నారు.

తప్పు పట్టిన షోయబ్‌ అక్తర్‌
షోయబ్ అక్తర్ కూడా రజాక్‌ వ్యాఖ్యలను ఖండించాడు. స్త్రీలపై ఇలాంటి జోక్,పోలిక సరికాదని అన్నారు. 'ఏ స్త్రీని ఇలా అగౌరవపరచకూడదు. ఆ సమయంలో అతని పక్కన కూర్చున్న వ్యక్తులు నవ్వడం, చప్పట్లు కొట్టడం కూడా తప్పే. ఆ సమయంలో వారు రజాక్‌ను తప్పు పట్టాల్సింది. ఇది క్షమించరాని తప్పు. అతనిపై తిరగబడి హెచ్చరించాల్సింది.' అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు.

మరిన్ని వార్తలు