Varsha Bollamma: ఆ రూల్‌ పెట్టుకోలేదు.. నాకు వచ్చిన పాత్రలు చేస్తున్నా

8 Mar, 2022 23:14 IST|Sakshi
వర్ష బొల్లమ్మ 

‘‘కోవిడ్‌ తర్వాత అందరూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నారు. థియేటర్స్‌కు వచ్చినవారు హాయిగా నవ్వుకోవాలి. మా ‘స్టాండప్‌ రాహుల్‌’ సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్‌ చేసి, థియేటర్ల నుంచి నవ్వుతూ బయటికొస్తారు’’ అని వర్ష బొల్లమ్మ అన్నారు. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వంలో రాజ్‌ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగులూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘స్టాండప్‌ రాహుల్‌’లో శ్రేయ పాత్రలో నటించాను. నా పాత్ర స్ట్రాంగ్‌గా ఉండటంతో పాటు స్క్రీన్‌ స్పేస్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. శాంటో మామూలు సమయంలో కూల్‌గా ఉన్నా, సెట్‌లో మాత్రం సినిమా గురించే ఆలోచించేవారు. ఈ చిత్రనిర్మాతలు దర్శకునికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ఔట్‌పుట్‌ బాగా వచ్చేలా సహకరించారు. ఆయా ప్రాంతాల కల్చర్, భాష నేర్చుకోవడం నాకు ఇష్టం. ‘మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్, స్టాండప్‌ రాహుల్‌’ చిత్రాలకు తెలుగులో నేనే డబ్బింగ్‌ చెప్పాను.

గ్లామర్‌ పాత్రలు చేయడం లేదేంటి? అని కొందరు అడుగుతున్నారు. నాకు వచ్చిన పాత్రలు చేస్తున్నాను.. అయితే ఇలాంటి పాత్రలే చేయాలని రూల్‌ ఏమీ పెట్టుకోలేదు. నా పాత్ర నిడివి ఎక్కువగా లేకపోయినా పాత్ర బలంగా ఉండాలనుకుంటాను. విజయ్‌ సార్‌ ‘బిగిల్‌’ (తెలుగులో ‘విజిల్‌)లో నా స్క్రీన్‌ స్పేస్‌ తక్కువ అయినా పాత్రకు ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘స్వాతి ముత్యం’ అనే సినిమా చేస్తున్నాను. మరో సినిమాకి కూడా సంతకం చేశాను’’ అన్నారు. 

మరిన్ని వార్తలు