Vijayashanthi: విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానంలో కష్టాలు,విజయాలు.. ఆమె భర్త ఎవరో తెలుసా?

15 Oct, 2023 13:03 IST|Sakshi

తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించి అనేక విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించి వారికి ఏ మాత్రం తాను తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందారు. తన సినిమాలకు స్టార్స్‌ అక్కర్లేదని నిరూపించిన ఏకైక ఇండియన్‌ హీరోయిన్‌ విజయశాంతి. సినిమా రంగంలో ఎన్నో విజయాలను అందుకున్న విజయశాంతో ఈ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సరిగ్గా 45 సంవత్సరాలు పూర్తి అయింది. అంతేకాకుండా 1983 అక్టోబర్ 15న తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన నేటి భారతం చిత్రం విడుదలయి నేటికి 40 ఏళ్లు పూర్తి అయింది. ఇలా ఈరోజు ఆమెకు మరెంతో  ప్రత్యేకం. ఇదే విషయాన్ని విజయశాంతి తన సోషల్‌ మీడియాలో తెలిపారు.

ఏడేళ్లకే బాలనటిగా ఎంట్రీ
జూన్ 24, 1966న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది విజయశాంతి. తన పిన్నిగారు అయిన విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుంచి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు సమాచారం ఉంది. కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా.

ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఆమె నటించింది. ఈ చిత్రానికి దర్శకురాలు విజయనిర్మల.

మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితం
విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది. వాటిలో చెప్పుకోతగినవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో ఎన్టీయార్, ఏయెన్నార్‌ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా చెప్పుకోతగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన 'నేటి భారతం'. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని చెప్పవచ్చు.

ఈ సినిమాతో మరో తార ఉద్భవించింది
1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం విజయశాంతి తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో విజయశాంతి జీవించిందని చెప్పవచ్చు. దీంతో నేటి భారతం సినిమా ఘన విజయానికి విజయశాంతి ప్రధాన కారణమైంది .

అలా అప్పటికే తెలుగు తెరపై జయసుధ, జయప్రద,శ్రీదేవి, మాధవి వంటి వారు అప్పటికే తెలుగు పరిశ్రమలో పాతుకుపోయారు. వారందరినీ సవాలు చేస్తూ విజయశాంతి రూపంలో మరో  తార వెండితెరపై ఉద్భవించింది. అక్కడి నుంచి ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా గెలుచుకుంది.

రెండుపడవల ప్రయాణం
ఆ తరువాత రెండేళ్లపాటు రెండుపడవల ప్రయాణంలా సాగింది విజయశాంతి సినీ పయనం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుంచి పది వరకూ అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయింది. అప్పట్లో ఆమె తరువాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారుండేవారు.

జయశాంతి విశ్వరూపం
1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది.

జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం
1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పీ.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ తన సొంత ప్రొడక్షన్‌ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ జాతీయ నటి అవార్డులను సంపాదించిపెట్టింది.

ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరి పార వేసే ఐ.పీ.ఎస్. అధికారిణి వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్క్ కు వెరవకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయి. ఒక్క సారిగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్‌లోకి ఆమె ఇమేజ్‌ చేరింది. మొదటి సారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్ స్టార్ అనే బిరుదుతో సంబోధించసాగాయి.

ఏడాది పాటు ఒక్క సినిమా కూడా లేదు
1993 లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. ఏడాది పాటు విజయశాంతి సినిమా అనేది థియేటర్లలో కనిపించలేదు. అలా అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది 'ఒసేయ్ రాములమ్మా'. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం.

అదే ఏడాది విడుదలై విజయవంతమయిన హిట్లర్, అన్నమయ్య, తొలిప్రేమ, ప్రేమించుకుందాం.. రా వంటి చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి పెట్టింది. అప్పటికి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నా బాక్సాఫీసు వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటిగా నంది అవార్డును ఆమెకి అందించింది.  అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలవడం ప్రారంభించారు.

ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే, 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్. కె. అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది. ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. తర్వాత కొన్ని సినిమాలు తీసిన అవి అంతగా మెప్పించలేదు. అలా సుమారు 13 ఏళ్లు బ్రేక్‌ తీసుకుని మహేశ్‌ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి అయినా నేటికి ఆమెకున్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.  

విజయశాంతి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు 

► ఆమె 1987లో మోటూరి  శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను ఎన్టీఆర్ పెద్దల్లుడు.. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు. దగ్గుబాటి పురందరేశ్వరి భర్త తరుపు నుంచి కూడా ఆయనకు బంధుత్వం ఉంది.
 చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్‌తో 7 చిత్రాలలో నటించించారు.
► తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేరు.
 కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
 విజయశాంతి నాలుగు నంది పురస్కారాలను దక్కించుకున్నారు. 
1987లో ఆమె చిరంజీవితో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడినాయి.
► హీరోలతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు. ఆ కాలంలో అదే టాప్‌.
► ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు.
► 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందారు.
► విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు.
 తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి.. అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 
 ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు
 విజయశాంతిని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీలో చేరి.. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.

సాక్షి, వెబ్‌ డెస్క్‌ ప్రత్యేకం

మరిన్ని వార్తలు