ఆహా, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌.. ఇలా పార్టిసిపేట్‌ చేయండి..

23 Nov, 2023 13:50 IST|Sakshi

తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివ‌ల్‌ను ఆవిష్క‌రించింది. ఈ సంచ‌ల‌నాత్మ‌క ఉత్స‌వంలో సినిమాల‌ను ప్ర‌ద‌ర్శించ‌టంతో పాటు గ్రూప్ డిస్క‌ష‌న్స్‌, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌, ప్యానెల్‌ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతాయి. వ‌ర్ధ‌మాన ద‌ర్శ‌కులు త‌మ ప్ర‌తిభ‌ను చాటిచెప్పుకోవడానికి ఇదొక వేదిక‌గా ప‌ని చేయ‌నుంది. ఈ వేడుకలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు https://blog.aha.video/entertainment/nominations-for-south-indian-film-festival/  ద్వారా అప్లై చేసుకోవ‌చ్చు.

మూడు విభాగాల్లో పోటీ
ఈ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేవారిని మూడు భాగాలుగా విభ‌జించారు. షార్ట్ ఫిలిం విభాగంలో 3-15 నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న షార్ట్ ఫిలిం పంపాలి. రెండో విభాగం షార్ట్స్ షార్ట్‌.. దీని కోసం మూడు నిమిషాల కంటే త‌క్కువ‌గా ఉన్న షార్ట్స్ షార్ట్‌ను పంపాల్సి ఉంటుంది. అలాగే మ్యూజిక్ వీడియో విభాగం కోసం ఐదు నిమిషాల కంటే త‌క్కువ‌గా ఉన్న వీడియోను చిత్రీక‌రించి పంపాలి. 2020లో జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్‌ 10 మధ్య వచ్చిన సినిమాల కంటెంట్‌తో వీడియోల‌ను చిత్రీక‌రించి పంపాల్సి ఉంటుంది.

డిసెంబర్‌ 20న తెలుగు ఫిలిం ఫెస్టివల్‌..
ప్రస్తుతం తెలుగులో ఈ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ఈ ఫెస్టివల్‌ నిర్వహించనున్నారు. టాలీవుడ్‌కి చెందిన స్టార్ మేకర్స్ ఈ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్‌గా పని చేయనున్నారు. నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, డైరెక్టర్స్‌ హరీష్ శంకర్, వి.ఎన్.ఆదిత్య, చందు మొండేటి.. నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్.. ఇండియ‌న్ టెలివిజ‌న్ చీఫ్ ఎడిట‌ర్‌గా ప‌ని చేసిన అనీల్ వాన్వ‌రి ఈ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్స్‌గా ఉన్నారు. డిసెంబ‌ర్ 20 నుంచి ఈ తెలుగు ఫిలిం ఫెస్టివ‌ల్‌ ఘ‌నంగా నిర్వ‌హించనున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియాలోని ప్ర‌ముఖ సినీ సెల‌బ్రిటీలు పాల్గొన‌నున్నారు.

చదవండి: సినిమా షూటింగ్‌లో హీరో సూర్యకు ప్రమాదం..

మరిన్ని వార్తలు