Ajith-AK62: నయన్‌ భర్త అవుట్‌.. ఏకే 62 మూవీకి ముహుర్తం ఫిక్స్‌

31 Mar, 2023 07:32 IST|Sakshi

తమిళసినిమా: నటుడు అజిత్‌ చివరిగా నటించిన తుణివు చిత్రం గత ఏడాది దీపావళికి తెరపైకి వచ్చింది. ఆ తరువాత ఆయన నటించనున్న చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కారణం  దర్శకుడు, నటి నయనతార భర్త విగ్నశ్‌ శివన్‌ దర్శకత్వంలో లైకా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా కూడా ఫిక్స్‌ అయ్యారు. చిత్ర ప్రీ పొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే చివరి సమయంలో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఆయన కథను పూర్తిగా రెడీ చేయకపోవడమేనని సమాచారం.

దీంతో ఆ తరువాత దర్శకుడు మగిళ్‌ తిరుమేణిని ఎంపిక చేశారు. అయితే చిత్రం ఎప్పుడు సెట్‌ పైకి వెళ్తుందనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. ఈ మధ్యలో నటుడు అజిత్‌ బైక్‌పై విదేశీ ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరిగింది. అదే విధంగా ఇటీవల అజిత్‌ తండ్రి కన్నుమూశారు. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్‌ షూటింగ్‌లో పాల్గొడానికి మరింత సమయం పడుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు అజిత్‌ నటించనున్న 62వ చిత్రం ప్రారంభానికి ముహూర్తం కరారైనట్లు తెలిసింది. ఏప్రిల్‌ నెలలో ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను పూర్తి చేసి మే నుంచి షూటింగ్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వేలువడే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు