Love Stories: ప్రేమ అదే ప్రాబ్లం వేరు

3 Oct, 2021 07:32 IST|Sakshi

సండే స్టోరీ

ఉన్నోళ్లు లేనోళ్లు... పట్నం పల్లె... ఆ మతం ఈ మతం... వెజ్‌ నాన్‌వెజ్‌... సమాజంలో సినిమాల్లో ప్రేమకు ప్రాబ్లమ్స్‌ సృష్టించాయి. ప్రేమ అలాగే ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంకా సీరియస్‌ సమస్యలను చర్చిస్తోంది. మొన్నటి ‘ఉప్పెన’ నిన్నటి ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ఇవాళ్టి ‘లవ్‌స్టోరీ’ ఆ సంగతే చెబుతున్నాయి.

కె.బాలచందర్‌ ‘మరో చరిత్ర’తో ప్రేక్షకులకు ప్రేమ అలల ప్రతాపం చూపించాడు. నిప్పులోన కాలదు నీటిలోన నానదు అని క్లయిమాక్స్‌ చేశాడు. మీరు ప్రేమికుల్ని నాశనం చేయగలరు... ప్రేమను కాదు అని చెప్పాడు. ఆ సినిమాలో హీరోయిన్‌ తెలుగు, హీరో తమిళం. పెద్దవాళ్లు వారిని ఎన్ని బాధలు పెట్టాలో అన్నీ పెట్టారు. చివరకు వాళ్లు ప్రాణం తీసుకునేదాకా ఊరుకోలేదు.

శేఖర్‌ కమ్ముల ‘లవ్‌స్టోరీ’లో ‘పంచాయితీల్లో పడాలని ఎవరనుకుంటారు. ప్రేమ అయిపోతుంది. అంతే’ అనే డైలాగ్‌ ఉంది. నిజం. ప్రేమ అయిపోతుంది. ఆ వయసు, ఆ ఆకర్షణ, ఆ శక్తి, ఆ సహనం ప్రేమికుల్ని వివశుల్ని చేస్తాయి. ప్రేమను తెగించే స్థాయికి తీసుకెళతాయి. ప్రేమికులు మారలేదు. పెద్దలే ఒక సమస్యను వదిలి ఇంకో సమస్యను ముందుకు తెస్తూ వెళుతున్నారు.

భారతీరాజా ‘సీతాకోకచిలుక’ కూడా భారీగా హిట్‌ అయ్యింది. దానిలో హిందూ క్రిస్టియన్‌ల మధ్య ప్రేమ. క్లయిమాక్స్‌లో ఊరే తగలబడే స్థాయికి వెళుతుంది. ఆర్థికంగా శక్తిమంతుడైన శరత్‌బాబు తన చెల్లెలు ముచ్చర్ల అరుణ ప్రేమను సంగీత పాఠాలు చెప్పుకునే ఇంటి కార్తీక్‌కు ఇవ్వడానికి ఇష్టపడడు. ఇక్కడ మతంతోపాటు ఆర్థిక స్థాయి కూడా విలన్‌ కావడాన్ని దర్శకుడు చూపిస్తాడు. అయితే ఆ కథ సుఖాంతం అవుతుంది.

చదవండి: (చై-సామ్‌ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!)

‘కులం’ ప్రేమకు అడ్డం కారాదని, ప్రేమ అలాంటి సంకుచితాల కంటే ఉన్నతమైనదని కె.విశ్వనాథ్‌ ‘సప్తపది’ తీసినప్పుడు ఆయన నుంచి అలాంటి ప్రేమకథ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆయన చెప్పిన పద్ధతికి కన్విన్స్‌ అయ్యారు. సినిమాను హిట్‌ చేశారు. అందులో అగ్రహారం అమ్మాయి దళిత కుర్రాడిని ప్రేమిస్తుంది. ‘గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన’ పాట ఉంది ఇందులో. పశువు రంగుకీ పాల రంగుకీ సంబంధం లేదు. ఆరాధనకు వర్ణం లేదు. ప్రేమకు కులం లేదు. కలిసిన ఏ రెండు మనసులైనా సప్తపదికి అర్హమైనవే అని దర్శకుడు చెబుతాడు.

ఆ తర్వాత చాలారోజులకు హిందీ ‘బాబీ’ స్ఫూర్తితో తేజ ‘నువ్వు నేను’ తీశాడు. ఇందుకు సాంస్కృతిక తారతమ్యం ప్రధానంగా విభేదం తెస్తుంది. డబ్బు రెండు వర్గాల దగ్గర ఉంది. కాని ఒకరు సూటూ బూటూ వేసే బంగళావాళ్లైతే మరొకరు పాడీ పశువూ యాస ఉన్నవారు. ‘మీపెద్దోళ్లున్నారే’ అని హీరో ఉదయ్‌కిరణ్‌ అన్నట్టు పెద్దోళ్ల లెక్కలు పెద్దోళ్లవి. పిల్లలకు ఆ లెక్కలు పట్టవు. వారి దృష్టిలో వాటి విలువ గుండుసున్నా.  చదవండి: (సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్‌ వైరల్‌)

కులపట్టింపు ప్రేమికులు పెళ్లి చేసుకున్నాక కూడా వెంటాడుతుందని తమిళంలో నుంచి తెలుగులోకి డబ్‌ అయిన ‘ప్రేమిస్తే’ చెప్పింది. అందులో పారిపోయిన ప్రేమికులను వెంటాడి విడదీస్తారు. మరాఠిలో ‘సైరా’ ఇదే పాయింట్‌ను పట్టుకుని పరువు హత్యను చూపించి భారీ విజయం నమోదు చేసింది. అందులో పారిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక కూడా ఆ ప్రేమికులను కుల అహంభావులు చంపుతారు. ఇప్పుడు ఈ కుల అహంభావం తెలుగు సినిమాల్లో చర్చకు వస్తోంది.

‘మంచివాడే కానీ మనవాడు కాడు’ అనే డైలాగ్‌ ఉంది కరుణ కుమార్‌ తీసిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ సినిమాలో. ఈ ‘మనవాడు’ కాకపోవడమే హీరోయిన్‌ తండ్రికి సమస్య. అతనిది సోడా వ్యాపారం. కాని కుల పట్టింపు విషయంలో రాజీ పడడు. చివరకు కన్నకూతురినే పరువు కోసం హత్య చేస్తాడు. ‘ఉప్పెన’లో కూడా అంతే. హీరోయిన్‌కు ఆస్తి ఉంది. కులం ఉంది. హీరో కులం వాళ్లకు ‘చాల్లేదు’. సముద్రం మీద సాహసంగా వెళ్లి వేట చేసే కుర్రాడు ఎంత యోగ్యుడైనా హీరోయిన్‌ తండ్రి అహానికి సరిపోడు. చివరకు హీరో మగతనానికే నష్టం కలిగించే స్థాయికి వెళతాడు.

‘లవ్‌స్టోరీ’లో హీరో కులం హీరోయిన్‌ ఇంటికి బయట చెప్పులు విడిచి వచ్చే స్థాయికి ‘నెట్టబడిన’ కులం. ఊళ్లో ఉన్న వివక్షను తట్టుకోలేక సిటీకి వచ్చి బతుకుతుంటే ప్రేమ విషయంలో పెళ్లి విషయంలో ఊరు హీరోను తరుముతూనే ఉంటుంది. చివరకు శ్మశానం కూడా అగ్రకులాలకు ఒకటి... అణగారిన కులాలకు ఒకటి. ‘తిరగబడి ప్రేమను సాధించుకుందాం’ అనుకుంటాడు హీరో. తిరగబడే తెగింపుకు నెడుతున్నది ఎవరు?

సమాజం అయినా సినిమా అయినా ప్రేమను తప్పించుకోలేదు. సమాజం ప్రేమికులకు ఎన్నో సవాళ్లు విసురుతున్నా ప్రేమికులు ఓడిపోతుండవచ్చు కాని ప్రేమ ఓడిపోవడం లేదు. అది మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంది. ఇవాళ చాలా కుటుంబాల్లో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. వాటిలో కులాంతరం, మతాంతరం, ఖండాంతరం ఉన్నాయి. ఒప్పుకునే మనసుంటే ఎంత పెద్ద సమస్యా సమస్య కాకుండా పోతుంది. ఒప్పుకోకపోతే చిన్న సమస్య కూడా సమస్యే. ప్రేమ పుట్టనే కూడదు. పుట్టాక దానిని సఫలం చేసుకోవడానికి ప్రేమికులు చేసే ప్రతి పోరాటం ఇక ముందు కూడా సినిమా కథే అవుతుంది.

మరిన్ని వార్తలు