బచ్చల మల్లి షురూ

2 Dec, 2023 05:23 IST|Sakshi
∙‘అల్లరి’ నరేశ్, సుబ్బు, అనిల్‌ రావిపూడి, రాజేశ్‌ దండా

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా ‘బచ్చల మల్లి’ సినిమా షురూ అయింది. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అమృతా అయ్యర్‌ కథానాయిక. హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాప్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, అనిల్‌ రావిపూడి క్లాప్‌ ఇవ్వగా, విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకులు మారుతి, బుచ్చిబాబు స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ‘‘న్యూ ఏజ్‌ యాక్షన్‌ డ్రామాగా యునిక్‌ కథతో ‘బచ్చల మల్లి’ రూపొందుతోంది. 1990 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్  ఎక్కువగా ఉంటుంది. ‘అల్లరి’ నరేశ్‌ ఇంటెన్స్‌ రోల్‌ చేస్తున్నారు. ఆయన కెరీర్‌లో 63వ చిత్రమిది. పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు నరేశ్‌. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలో ప్రారంభమవుతుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. కోట జయరామ్, రావు రమేశ్, సాయికుమార్, ధనరాజ్, హరితేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్‌ ఎం.నాథన్‌.

మరిన్ని వార్తలు