ఒకప్పుడు స్టార్‌ హీరో.. ఇప్పుడేమో విలన్.. అంతే కాదు వేల కోట్ల వ్యాపారం!

6 Dec, 2023 17:18 IST|Sakshi

సినీ తారలకు సినిమా ఒక్కటే ప్రపంచం కాదు. ఎంత స్టార్‌డమ్ వచ్చినా వారు కేవలం ఆ రంగానికే పరిమితం కారు. తమ టాలెంట్‌ను పలు రకాలుగా చూపిస్తారు. కేవలం సినిమాల్లోనే చేస్తూ ఖాళీగా ఉండరు. కాస్తా సమయంలో దొరికితే చాలు ఏదో ఒక బిజినెస్‌ చేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో కనిపిస్తారు నటుడు అరవింద స్వామి. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా ధైర్యంగా నిలిచిన అతి కొద్దిమందిలో ఒకరాయన. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. ఎందుకంటే రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రంలో ప్రతి నాయకుడిగా అభిమానుల మనసులు గెలుచుకున్నారు.

20 ఏళ్లకే సినీ కెరీర్ ప్రారంభం

1991లో 20 ఏళ్లకే మణిరత్నం సినిమా తలపతిలో ఎంట్రీ ఇచ్చిన అరవింద స్వామి.. బొంబాయి, రోజా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాతే స్టార్ హీరోగా గుర్తింపు దక్కింది. అనంతరం బాలీవుడ్ భామ కాజోల్‌తో నటించిన చిత్రం మిన్సార కనవు చిత్రానికి జాతీయ అవార్డు వరించింది. ఆ తర్వాత ఏడాదిలోనే సాత్ రంగ్ కే సప్నే చిత్రంలో జూహీ చావ్లా సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికీ కూడా అతన్ని కోలీవుడ్‌లో రజనీకాంత్, కమల్ హాసన్‌ల లాంటి స్టార్స్‌కు వారసుడిగా భావిస్తారు.  అయితే 1990ల్లోనే బొంబాయి, రోజా సినిమాలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగిన అరవింద్ స్వామి ఓ వ్యాపారవేత్త అని చాలామందికి తెలియదు. ప్రస్తుతం అరవింద్ స్వామి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం గురించి వివరాలేంటో తెలుసుకుందాం. 

30 ఏళ్లకే నటనకు గుడ్‌బై- పక్షవాతంతో పోరాటం

అయితే 90వ దశకం చివరి నాటికి అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. దీంతో తన సినిమా కెరీర్ పట్ల నిరాశతో ఉన్న స్వామి.. 2000 తర్వాత సినిమాల్లో నటించడం మానేశాడు. ఆ తర్వాత తన తండ్రి వ్యాపార వ్యవహరాలను చూసుకున్నారు. వీడీ స్వామి అండ్ కంపెనీలో పని చేస్తూనే.. ఆపై ఇంటర్‌ప్రో గ్లోబల్‌లో పని చేయడంపై దృష్టి సారించారు. అయితే 2005లో అతని కాలు పాక్షికంగా పక్షవాతానికి దారితీసింది. 

వ్యాపార సామ్రాజ్యం

అయినప్పటికీ 2005లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించారు.  పక్షవాతం నుంచి కోలుకున్నాక పే రోల్ ప్రాసెసింగ్, తాత్కాలిక సిబ్బందిని నియమించే టాలెంట్ మాక్సిమస్ అనే సంస్థను స్థాపించారు. రాకెట్‌ రీచ్ వంటి మార్కెట్ ట్రాకింగ్ పోర్టల్‌ డేటా ప్రకారం.. 2022లో టాలెంట్ మాగ్జిమస్ ఆదాయం దాదాపు 418 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో రూ. 3300 కోట్లు)గా ఉంది. ప్రస్తుతం అరవింద్ స్వామి ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

సినిమాల్లో రీ ఎంట్రీ

అయితే మళ్లీ 2013లో తన గురువు మణిరత్న ప్రాజెక్ట్ కాదల్‌తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన స్వామి తెలుగులో రామ్ చరణ్‌ మూవీ ధృవలో విలన్‌గా మెప్పించారు. 2021లో అతను తమిళ-హిందీ ద్విభాషా చిత్రం తలైవిలో కంగనా రనౌత్ సరసన ఏంజీ రామ్‌చంద్రన్‌ పాత్రలో నటించారు. 


 

>
మరిన్ని వార్తలు