'అవును.. అలా నటించాల్సి వచ్చింది.. అందులో తప్పేముంది'

8 Sep, 2022 08:15 IST|Sakshi

హీరోలతో నటించే సమయంలో హద్దులు మీరరాదని అంటోంది అశ్విని చంద్రశేఖర్‌. బెంగళూరుకు చెందిన ఈ అమ్మడు మాతృభాషను దాటి తమిళం, తెలుగు, మలయాళం అంటూ దక్షిణాది సినిమాను చుట్టేస్తుంది. ఆర్కిటిక్‌ పట్టభద్రురాలైన ఈమె నటనపై ఆసక్తితో సినిమా రంగానికి పరిచయం అయ్యింది. తమిళంలో జీవీ, కాల్‌ టాక్సీ, మరకతకాడు, కాదల్‌ పుదిదు టైటిల్, తదితర చిత్రాలలో నటించింది. ఈమె నటించిన మెర్లిన్‌ చిత్రం ఇటీవలే విడుదలైంది.

మలయాళంలో నటుడు నవీన్‌ బాలికి జంటగా నటించిన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. వెట్రికి జంటగా నటించిన జీవీ–2 చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. వి.హౌస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేష్‌ కామాక్షి నిర్మించిన చిత్రం ఇంతకు జీవీ చిత్రానికి పని చేసిన యూనిట్‌నే ఈ చిత్రానికి పని చేశారు. ఇందులో నటి అశ్విని చంద్రశేఖర్‌ ఒక పాటలో హీరోతో చాలా సన్నిహితంగా నటించడం చర్చనీయాంశంగా మారింది.

చదవండి: ('త్వరగా పూర్తి చేయండి ప్లీజ్‌'.. తమన్నా రిక్వెస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌)

దీనిపై స్పందించిన ఆమె జీవీ చిత్రంలో నటించే అవకాశం ఆడిషన్‌ ద్వారా వచ్చిందని చెప్పింది. అందులో అంధురాలిగా ఛాలెంజింగ్‌ పాత్రను చేశానని తెలిపింది. దర్శకుడు సూచనలను, తాను బయట ప్రపంచంలో చూసిన విషయాలను క్రోడీకరించుకుని ఆ పాత్రకు న్యాయం చేశానని చెప్పింది. 2019లో విడుదలైన ఆ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని మలేషియా, సింగపూర్‌ వంటి ఇతర దేశాల నుంచి పలువురు అభిమానులు ఫోన్‌ చేసి ప్రసంశించారని చెప్పింది. తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందించిన జీవీ–2 చిత్రంలోని అదే యూనిట్‌ పనిచేయడంతో తనకు చాలా సౌకర్యంగా అనిపించిందని చెప్పింది.

ఈ చిత్రంలో తన పాత్రను మరింత మెరుగుపరిచారని తెలిపింది. ఈ చిత్రం థియేటర్లో విడుదలైతే బాగుండని భావించానని, ఓటీటీలో విడుదలైనా, వీక్షకుల ఆదరణ చూస్తే సంతోషంగా ఉందని చెప్పింది. ఇందులో నీ నీ పోదుమే అనే పాటలో హీరోతో చాలా సన్నిహితంగా నటించినట్లు చెబుతున్నారని, ఆ సన్నివేశం డిమాండ్‌ మేరకు అలా నటించాల్సి వచ్చిందని, అందులో తప్పేమీ లేదని అయితే దేనికైనా హద్దులు ఉంటాయని నటి పేర్కొంది.   

మరిన్ని వార్తలు