Bandla Ganesh: చంద్రబాబు సభలో బండ్ల గణేశ్ ఏడుపులు.. నిజంగా మహానటుడే!

30 Oct, 2023 17:05 IST|Sakshi

గచ్చిబౌలిలో బండ్ల గణేశ్ విచిత్ర ప్రతిపాదన

చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించిన బండ్ల గణేశ్

చంద్రబాబు లేకపోతే సాఫ్ట్‌వేర్‌లో లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవే కాదట

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.  ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. 

వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్.

ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్‌వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే  ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు.

చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్‌లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. 

ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు.  అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు.  కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే.

మరిన్ని వార్తలు