ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం: డైరెక్టర్‌ శ్రీరామ్‌

18 May, 2023 19:19 IST|Sakshi

డైరెక్టర్‌ కావాలన్న ఆశతో బంగారం లాంటి‌ జాబ్‌ వదిలేసుకున్నాడు శ్రీరామ్‌ ఆదిత్య. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఆయన ఫేస్‌బుక్‌, గూగుల్‌లో పని చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నాడు. ఉద్యోగం చేస్తూనే షార్ట్‌ ఫిలింస్‌ చేశాడు. వాటిలో ఒకదానికి ఇంటర్నేషనల్‌ అవార్డు వచ్చింది. దీంతో ఉద్యోగం మానేసి డైరెక్షన్‌ ట్రై చేశాడు. ఆ ప్రయత్నంలో భలే మంచి రోజు చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే మంచి మార్కులు పడ్డప్పటికీ తర్వాతి సినిమాకు మాత్రం దాదాపు రెండేళ్లు గ్యాప్‌ తీసుకున్నాడు. శమంతకమణి, దేవదాస్‌, హీరో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం శర్వానంద్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు.

సినిమాల్లో ట్విస్టులున్నట్లే ఆయన జీవితంలో కూడా ఎన్నో మలుపులున్నాయి. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ నుంచి సినీ రంగానికి రావడం, అలాగే ప్రేమించిన అమ్మాయితో పారిపోయి పెళ్లి చేసుకోవడం వంటి కీలక మలుపులున్నాయి. శ్రీరామ్‌ పెళ్లి గురించి అప్పట్లో ఓ వార్త తెగ వైరలయింది. దీని ప్రకారం శ్రీరామ్‌.. ప్రియాంక అనే ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆమె కూడా అతడిని ఇష్టపడింది. కానీ వీళ్ల ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. వేరొకరితో తన కూతురికి పెళ్లి ఫిక్స్‌ చేశారు. బంధుమిత్రులకు పత్రికలు పంచడం కూడా అయిపోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా శ్రీరామ్‌ ఆమెను తీసుకెళ్లి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఇందులో ఎంత నిజముందో కానీ వీరి పెళ్లి జరిగిన మాట మాత్రం వాస్తవం. వీరికి 2020లో బాబు పుట్టాడు.

తాజాగా ఓ షోకి భార్య ప్రియాంకతో కలిసి హాజరైన శ్రీరామ్‌ అప్పటి ప్రేమ ముచ్చట్లను పంచుకున్నాడు. 'మాకు రెండు పెళ్లి రోజులున్నాయి. ఒకటి ఆర్య సమాజ్‌లో జరిగింది. ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం. కానీ అప్పుడు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నెక్స్ట్‌ డే పెళ్లి పెట్టుకుని సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ బెనిఫిట్‌ షో చూశాం' అని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నాడు శ్రీరామ్‌.

చదవండి: ఓటీటీలో సందడి చేసే సినిమాలివే, ఆ ఒక్క సినిమా కోసమే అంతా వెయిటింగ్‌!

మరిన్ని వార్తలు