బిగ్‌బాస్ ట్రోఫీ గెల‌వ‌లేక‌పోతున్న అమ్మాయిలు

2 Dec, 2020 16:40 IST|Sakshi

అమ్మాయిలు ఆకాశంలో స‌గం అంటారు. ఇంటి మహా ల‌క్ష్మి అని కీర్తిస్తారు. అన్ని రంగాల్లో పురుషుల‌తో స‌మానమేన‌ని చెప్తారు. కానీ బిగ్‌బాస్‌కు వ‌చ్చేస‌రికి క‌థ అడ్డం తిరుగుతోంది. మిగ‌తా భాష‌ల్లోని సంగ‌తి ప‌క్క‌న‌పెడితే తెలుగులో మాత్రం బిగ్‌బాస్ అమ్మాయిల‌కు క‌లిసి రావ‌డం లేద‌ని తెలుస్తోంది. గ‌త మూడు సీజ‌న‌ల్లో వ‌రుస‌గా శివ బాలాజీ, కౌశ‌ల్ మండా, రాహుల్ సిప్లిగంజ్ విజేత‌లుగా నిలిచారు. అమ్మాయిలు మాత్రం ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకున్నారు. క‌నీసం ఈ సీజ‌న్‌లో అయినా అమ్మాయిలు గెలిచేందుకు ఆస్కారం ఉంటుందేమోన‌ని మొద‌ట్లో అంతా భావించారు. కానీ ప్ర‌స్తుత‌ ప‌రిస్థితులు చూస్తుంటే అంచ‌నాలు త‌ల‌కిందులు అవుతున్నాయి. గేమ్ వ‌న్‌సైడ్ అయిన‌ట్లు అనిపిస్తోంది.

ప‌ది మందిలో ముగ్గురే మిగిలారు..
19 మంది కంటెస్టెంట్ల‌తో నిండిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో 10 మంది అమ్మాయిలే ఉండేవారు. కానీ ఆ సంఖ్య‌ ఇప్పుడు మూడుకు చేరింది. మోనాల్‌, హారిక‌, అరియానా మాత్ర‌మే ఇంకా హౌస్‌లో నిల‌దొక్కుకోగ‌లిగారు. స్ట్రాంగ్‌గా ఉంటూ అంద‌రినీ గ‌డ‌గ‌డ‌లాడించిన అరియానా.. అవినాష్ చెంత‌న చేరి త‌న గేమ్ త‌నే నాశ‌నం చేసుకుంటోంది. అటు హారిక మ‌గాళ్ల‌తో స‌మానంగా పోటీప‌డుతున్న‌ప్ప‌టికీ రిలేష‌న్స్‌కు ఎక్కువ ప్రాధాన్య‌తనిస్తూ కేరాఫ్ అభిజిత్‌గా మారిపోయింది. మోనాల్ మీద‌ వ్య‌తిరేక‌త ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది కానీ టైటిల్ కొట్టేంత శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను ఆమె ఇంకా బ‌య‌ట‌కు తీయ‌డం లేదు. మిగ‌తావాళ్ల ఆటతో పోలిస్తే వీళ్ల‌లో ఒక‌రు టైటిల్ చేజిక్కించుకునే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. (చ‌ద‌వండి: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంటు నా భార్య, మోసం చేసింది‌)

ఆడ‌వాళ్ల‌కు నాలుగో'సారీ'..
దీంతో ఈ సీజన్‌లో కూడా ట్రోఫీని అమ్మాయిలు ఎగ‌రేసుకుపోవ‌డమ‌నేది ప‌గ‌టి క‌ల‌గానే మార‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎనీ టైమ్‌ అభిజిత్ ట్రెండింగ్‌లో ఉంటున్నాడు. అత‌డే విన్న‌ర్ అని తేల్చేస్తున్నారు. ఏ పోలింగ్ సైట్లు చూసినా అత‌డికే సుమారు 40 శాతం ఓట్లు ప‌డుతుండ‌టం విశేషం. త‌ర్వాత టైటిల్ రేసులో సోహైల్‌, అఖిల్ ఉన్నారు. ఈ ఇద్ద‌రిలో ఇప్ప‌టికే అఖిల్ టాప్ 5లో బెర్త్ క‌న్ఫార్మ్ చేసుకున్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈ సీజ‌న్‌ టైటిల్ పోరు అభిజిత్‌, అఖిల్‌, సోహైల్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ ఈ మూడు వారాల్లో ఏదైనా అద్భుతం జ‌రిగి అమ్మాయిలు టాస్కుల్లో అబ్బాయిల‌ను డామినేట్ చేసినా వాళ్లు టాప్ 3కి మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్‌కు గడ్డు కాలం?)

మరిన్ని వార్తలు