BB Telugu 7 Winner Pallavi Prashanth: బిగ్‌బాస్‌ 7 విజేతగా రైతుబిడ్డ.. రెమ్యునరేషన్‌ + ప్రైజ్‌మనీ ఎంతంటే?

17 Dec, 2023 22:34 IST|Sakshi

బిగ్‌బాస్‌ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌.. ప్రతి మనిషిలోనూ లోటుపాట్లు ఉంటాయి. అలాగే ఇతడిలోనూ ఉన్నాయి. నామినేషన్స్‌ అప్పుడు ఒకలా.. సాధారణ సమయాల్లో మరోలా ప్రవరిస్తూ అపరిచితుడిగా ముద్ర వేయించుకున్నాడు. నామినేషన్స్‌లో ఇతడు చేసే ఓవరాక్షన్‌ చూసి జనాలకు చిరాకు పుట్టింది. అయితే నామినేషన్స్‌లో ఎలా ఉన్నా మిగతా సమయాల్లో మాత్రం సామాన్యుడిగా, అతి మామూలుగా ఉండేవాడు. రానూరానూ తన తప్పులు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకున్నాడు. ఎవరెంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప అతిగా ఆవేశపడలేదు.

బిగ్‌బాస్‌ 7 ట్రోఫీ అందుకున్న ప్రశాంత్‌
తన ఫోకస్‌ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్‌ ఉన్న ప్రశాంత్‌ చిన్నచిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతీ గేమ్‌ అనుకున్నారు. కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్‌ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్‌బాస్‌ 7 ట్రోఫీ అందుకున్నాడు. 

ప్రైజ్‌మనీలో కోత
బిగ్‌బాస్‌ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్‌, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్‌లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ విన్నర్‌ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్‌ కట్‌ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు.

పారితోషికం తక్కువే కానీ..
ఇక ప్రశాంత్‌కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 వెనకేసినట్లు భోగట్టా. అయితే తను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్‌ కటింగ్స్‌ ఉంటాయట. ఆ కటింగ్స్‌ పోనూ దాదాపు రూ.8 లక్షల పైచిలుకు తన చేతికి రానున్నట్లు కనిపిస్తోంది. అంటే పారితోషికం(రూ.15,75,000)+ ప్రైజ్‌మనీ(రూ.35 లక్షలు) మొత్తం కలిపి రూ.50 లక్షలపైనే తనకు రావాల్సి ఉన్నా ఈ ట్యాక్స్‌లు అన్ని పోనూ దాదాపు రూ.25- 27 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది. దీనితో పాటు అదనంగా ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు.

చదవండి: ఆ ఒక్క విషయంలో ప్రియాంక సూపర్.. మొత్తం సంపాదన ఎంతంటే?
అర్జున్‌ ఎలిమినేట్‌.. కేవలం 10 వారాల్లోనే అంత సంపాదించాడా?

>
మరిన్ని వార్తలు