Kiran Rathore: రెండుసార్లు బ్రేకప్‌, డిప్రెషన్‌లో.. నేను కూడా కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలినే

25 Sep, 2023 17:18 IST|Sakshi

బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చానా? అని ఫీలవుతోంది కిరణ్‌ రాథోడ్‌. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అడుగుపెట్టిన ఆమె తెలుగు రాక అష్టకష్టాలు పడింది. తను మాట్లాడే భాష అర్థం చేసుకోలేక అటు ప్రేక్షకులు సైతం తెగ కష్టపడ్డారు. ఇరువురి బాధను చూడలేకపోయిన బిగ్‌బాస్‌ ఆమెను మొదటి వారంలోనే అవతలికి పంపించేశాడు. హీరోయిన్‌ అని కూడా చూడకుండా, తన టాలెంట్‌ కూడా బయటపెట్టనివ్వకముందే ఫస్ట్‌ వీక్‌లోనే ఎలా పంపించేస్తారని బాధపడుతోంది కిరణ్‌ రాథోడ్‌. తెలుగు బిగ్‌బాస్‌కు బదులు తమిళ, హిందీ బిగ్‌బాస్‌ షోకి వెళ్లాల్సిందని, అప్పుడు ఈ భాష అనే అడ్డుగోడ ఉండేదే కాదని వాపోయింది.

అంత ఈజీ కాదు
ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన కిరణ్‌ రాథోడ్‌కు గతంలో రెండు సార్లు లవ్‌ బ్రేకప్‌ అయింది. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ బారిన కూడా పడిందట. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. 'దక్షిణాదిన హీరోయిన్‌గా ఎంత పాపులారిటీ ఉన్నా సరే ముంబైకి వచ్చి కష్టాలు పడాల్సిందే! అప్పటికాలంలో సౌత్‌లో ఎవరు టాప్‌ హీరోయిన్‌ అనేది కూడా వారికి తెలియదు. అందుకే నేను బాలీవుడ్‌కు వెళ్లినప్పటికీ సరిగ్గా నిలదొక్కుకోలేక మళ్లీ వెనక్కు వచ్చేశాను. చెన్నైలోనే సెటిలయ్యాను. బాలీవుడ్‌లో క్రేజ్‌, ఫేమ్‌ తెచ్చుకోవడం అంత సులువైన విషయం కాదు.

కాంప్రమైజ్‌ అడిగారు, రిజెక్ట్‌..
అంతేకాదు అక్కడ ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాల వల్ల డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కాంట్రాక్టు మీద సైన్‌ చేశాక అసలు రంగు బయటపెట్టేవాళ్లు. ఈరోజు రాత్రికి వస్తున్నావ్‌ కదా.. అని అడిగేవాళ్లు. అప్పుడు నా చేతిలో సౌత్‌ మూవీలు, బాలీవుడ్‌ చిత్రాలు.. ఏవీ లేవు. అయినా సరే కాంప్రమైజ్‌ అడిగేసరికి ప్రాజెక్ట్‌ నుంచి బయటకొచ్చేసేదాన్ని. నటన మానేసి ఏదైనా సైడ్‌ బిజినెస్‌ చేద్దామనుకున్నాను. ప్రస్తుతం అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏ పని గురించి ఎవరినీ అడగాల్సిన పని లేదు. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

రెండుసార్లు బ్రేకప్‌..
గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్‌లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్‌ అయింది. ఆ వయసులో వారు కొట్టినా కూడా మనమీద అతి ప్రేమతో అలా చేశారేమో అనిపించేది. కానీ నెమ్మదిగా అన్నీ అర్థమయ్యాయి. గత ఏడేళ్లుగా ఎవరినీ డేటింగ్‌ చేయలేదు. ఇప్పట్లో పెళ్లి  చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు' అని చెప్పుకొచ్చింది కిరణ్‌ రాథోడ్‌.

చదవండి: శివాజీది కన్నింగ్‌ గేమ్‌, ప్రశాంత్‌ గురించి మాట్లాడటమే వేస్ట్‌..

మరిన్ని వార్తలు