కల్లర్‌ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న మన హీరోలు

21 Jan, 2024 03:30 IST|Sakshi

కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్‌ డార్క్‌గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్‌ ట్యాన్‌ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్‌ బ్లాక్‌గా, ట్యాన్‌ అయిన స్కిన్‌తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్‌ మేకప్‌ వేసుకుని, సిల్వర్‌ స్క్రీన్‌పై మేజిక్‌ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.


 31లో కొత్తగా...  
హీరో ఎన్టీఆర్, డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్‌ 31’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్‌లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ పోస్టర్‌లో ఎన్టీఆర్‌ పూర్తి నలుపు రంగు మేకప్‌లో కనిపించారు. ప్రశాంత్‌ నీల్‌ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2, సలార్‌’ల తరహాలో ఎన్టీఆర్‌ 31 బ్లాక్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్‌.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్‌ 31’ షూటింగ్‌ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్‌ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్‌ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్‌ నీల్‌ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. 


గోల్డ్‌ ఫీల్డ్స్‌లో తంగలాన్‌ 
పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్‌. దర్శకుడి విజన్‌ 100 శాతం అయితే విక్రమ్‌ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్‌ ‘తంగలాన్‌’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్‌ పరిపాలన కాలంలో కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ 
ఉంటుందట. 

ఇందులో విక్రమ్‌ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్‌ ఫస్ట్‌ లుక్‌ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయ
నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు.

భ్రమయుగంలో... 
దాదాపు 50 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్‌ రోల్‌లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది.

అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్‌ పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్‌లో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 


గొర్రెల కాపరి 
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్‌ రాసిన ‘గోట్‌ డేస్‌’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్‌ బ్లెస్సీ. హాలీవుడ్‌ యాక్టర్‌ జిమ్మీ జీన్‌ లూయిస్, అమలా పాల్, కేఆర్‌ గోకుల్, అరబ్‌ ఫేమస్‌ యాక్టర్స్‌ తాలిబ్‌ అల్‌ బలూషి, రిక్‌ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్‌ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్‌ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్‌. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్‌ లుక్‌ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.  
 

∙హ్యాండ్‌సమ్‌గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్‌’ సినిమా కోసం పక్కా మాస్‌ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది.


‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ ఓ డైలాగ్‌ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్‌ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘సలార్‌: పార్ట్‌ 1– సీజ్‌ఫైర్‌’ డిసెంబరు 22న విడుదలై హిట్‌గా నిలిచింది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్‌ దేవ పాత్రలో ప్రభాస్‌ లుక్‌ కూడా బ్లాక్‌ షేడ్‌లో ఉంటుంది. రెండో భాగంలోనూ  ప్రభాస్‌ ట్యాన్‌ లుక్‌లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. 

ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్‌హాసన్‌ గత బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘విక్రమ్‌’ (2022)లో రోలెక్స్‌ పాత్రలో ట్యాన్‌ లుక్‌లో కనిపించారు సూర్య. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్‌ పార్ట్‌ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్‌ లుక్‌లో కనిపిస్తారు.

>
మరిన్ని వార్తలు