బాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకనటుడి హఠాన్మరణం

9 Mar, 2023 08:00 IST|Sakshi

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనటుడు సతీష్‌ కౌశిక్‌(67) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని మరో సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ట్వీట్‌ ద్వారా ధృవీకరించారు. 

తమది 45 ఏళ్ల స్నేహమని, ఇకపై సతీష్‌ లేకుండా జీవితంలో ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ట్విటర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు అనుపమ్‌ ఖేర్‌. మరోవైపు నటి కంగనా రనౌత్‌తోపాటు ఇతర బాలీవుడ్‌ ప్రముఖులు సైతం సతీష్‌ హఠాన్మరణంపై విచారం, సోషల్‌ మీడియా ద్వారా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు.  సతీష్‌ కౌశిక్‌ తన నివాసంలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

13 ఏప్రిల్‌ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్‌ కౌశిక్‌.. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్‌ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆపై బాలీవుడ్‌లో సతీష్‌ కౌశిక్‌కు బ్రేక్‌ దక్కింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్‌ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు. కల్ట్‌ క్లాసిక్‌ చిత్రంగా గుర్తింపు పొందిన ఆ సినిమా సంభాషణలు చాలా కాలం పాటు  హిందీ ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి. ఆపై యాక్టర్‌గా కొనసాగారు. కమెడియన్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్‌లో రాణించారు. 

శ్రీదేవి లీడ్‌ రోల్‌లో నటించిన రూప్‌ కీ రాణి.. చోరో కా రాజా, టబు లీడ్‌ రోల్‌లో నటించిన ‘ప్రేమ్‌’ చిత్రాలకు ఈయనే దర్శకుడు. కానీ, ఈ రెండు చిత్రాలు ఆడలేదు. అయితే.. హమ్‌ ఆప్‌కే దిల్‌ మే రహ్‌తే హై, తేరే సంగ్‌ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అలరించాయి. 

మిస్టర్‌ ఇండియాలో ‘క్యాలెండర్‌’,  దీవానా మస్తానాలో పప్పు పేజర్‌ పాత్రలు ఐకానిక్‌ రోల్స్‌గా హిందీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. రామ్‌ లఖన్‌(1990)తో పాటు సాజన్‌ చలే ససూరల్‌(1997) చిత్రానికి బెస్ట్‌ కమెడియన్గా ఆయన ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు