Actor Vijayakanth Life Story: కానరాని లోకాలకు కరుప్పు ఎంజీఆర్‌.. ఎన్ని కష్టాలు వచ్చినా..

29 Dec, 2023 10:37 IST|Sakshi

కెప్టెన్‌ విజయకాంత్‌ అస్తమయం

కన్నీటి సంద్రంలో డీఎండీకే కేడర్‌, అభిమానులు

తమిళ రాజకీయాల్లో కరుప్పు ఎంజీఆర్‌గా, సినీ రంగంలో కెప్టెన్‌గా పేరు గడించిన సీనియర్‌ హీరో విజయకాంత్‌ (71) అనారోగ్య సమస్యలతో గురువారం చైన్నెలో కన్నుమూశారు. ఆయన మరణం దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం(డీఎండీకే) కేడర్‌ను, సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచింది. తమ నేత చివరి చూపు కోసం తమిళనాడు నలుమూలల నుంచి అభిమానులు చెన్నైకి పోటెత్తారు. దీంతో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయ పరిసరాలు కిక్కిరిసాయి.

సాక్షి, చైన్నె: కరుప్పు ఎంజీఆర్‌ (నలుపు ఎంజీఆర్‌), కెప్టెన్‌, పురట్చి కలైంజ్ఞర్‌ (విప్లవనటుడు)గా మధురైలో స్థిరపడిన తెలుగు సంతతి కుటుంబానికి చెందిన విజయ్‌రాజ్‌ నాయుడు తమిళ తెరపై తనదైన ప్రతిభతో విజయకాంత్‌గా మెరిశారు. తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఏకంగా పార్టీనే ప్రారంభించారు. 2005 సెప్టెంబర్‌ 14న మధురైలో జరిగిన బహిరంగ సభ ద్వారా డీఎండీకే (దేశీయ ముర్పోకు ద్రవిడ కళగం) పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆరు నెలల కాలంలో తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి తన సత్తా చాటుకున్నారు. పేదరికం, అవినీతి నిర్మూలనను, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు, నటుడు దివంగత నేత ఎంజీయార్‌ ఆశయాల సాధనే అజెండాగా చేసుకుని 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరుదాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయకాంత్‌ ఎంపికయ్యారు. అవినీతి నిర్మూలన, ప్రజాసంక్షేమ పరిపాలన నినాదంతో ప్రజాసేవలో ఒంటరిగా ముందుకు సాగారు.

అవిశ్రాంత శ్రమతో..
ఎన్నికల అనంతరం మూడేళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. డీఎండీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు. ముక్కుసూటితనం, విషయాన్ని కుండబద్దలు కొట్టడం, పసలేని ప్రభుత్వ పథకాలను నిర్మొహమాటంగా ఎండగట్టడం, తమిళుల రక్షణకు నడుం బిగించటం ద్వారా పార్టీ కేడర్‌ను, బలాన్ని పెంచుకున్నారు. దరిమిలా 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అతిపెద్ద అన్నాడీఎంకే పార్టీ తన వైపు చూసేలా చేశారు. ఈ ఎన్నికల ద్వారా తల పండిన నేతలతో నిండిన డీఎంకేను మూడో స్థానంలోకి నెట్టి ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అదే సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత అమ్మ జయలలితతో వైరం తదుపరి పరిణామాలతో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

డిపాజిట్లు గల్లంతు
అయినా, ఏమాత్రం తగ్గలేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ఎన్‌డీఏతో కలిసి తమిళనాట మూడో కూటమి ఏర్పాటులో సఫలీకృతులయ్యారు. ఆ ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతైనా, రాజకీయంగా దాడులు పెరిగినా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా ముందుకు సాగారు. 2016 అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తన నేతృత్వంలో కూటమి ఏర్పాటు ద్వారా కింగ్‌ మేకర్‌ స్థాయికి ఎదిగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పార్టీలోని ముఖ్య నేతలందరూ బయటకు వెళ్లడం, అంతకు ముందు ఎదురైన రాజకీయ దాడులతో ఈ ఎన్నికలలోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి.

అనారోగ్య సమస్యలు..
రాజకీయాల్లో పేదల పెన్నిదిగా నిలిచిన తమిళ ఆరాధ్య నటుడు ఎంజీఆర్‌, తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటిన ఎన్టీఆర్‌లే తనకు మార్గదర్శకులుగా చెప్పుకునేవారు విజయకాంత్‌. అయితే తనకు ఎదురైన అనారోగ్య సమస్యల కారణంగా క్రమంగా రాజకీయాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటములు, తన వెన్నంటి ఉన్న వారు గతంలో వెన్ను పోటుపొడవడం వంటి పరిణామాలతో బాధను మనసులో మోసి మరింత క్షీణించారు. విదేశాల్లో సైతం ఆయనకు అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. దీంతో పార్టీ బాధ్యతలను ఆయన భార్య ప్రేమలత విజయకాంత్‌ తన భుజాన వేసుకుని, కేడర్‌ చేజారకుండా ముందుకు సాగుతూ వచ్చారు. గత వారం జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశంలో విజయకాంత్‌ పాల్గొనడం కేడర్‌లో ఉత్సాహాన్ని నింపింది. ఇందులో తన ప్రధాన కార్యదర్శి పదవిని భార్యకు అప్పగించారు.

ఇక సెలవంటూ..
గత నెలలో కొన్ని రోజులు ఆయన ఆస్పత్రిలో ఉన్నా, చివరకు సర్వసభ్య సమావేశంలో పాల్గొనడంతో తమ నాయకుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారనే ఆనందంలో ఉన్న డీఎండీకే కేడర్‌, అభిమానులకు గురువారం విషాదకర సమాచారం చేరింది. తన సినీ, రాజకీయ ప్రయాణానికి ఇక సెలవంటూ కరుప్పు ఎంజీఆర్‌ అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని కేడర్‌ జీర్ణించుకోలేకపోయింది. ఆస్పత్రి నుంచి శాలిగ్రామంలోని నివాసానికి కెప్టెన్‌ పార్థివ దేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ లాంఛనాలు ముగించి కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఊరేగింపులో తండోప తండాలుగా అభిమానులు తరలి రావడంతో నాలుగు కిలోమీటర్ల దూరం దాటేందుకు 3 గంటలు పట్టింది. ముందుగా సీఎం ఎంకే స్టాలిన్‌, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్‌ బాలు, ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్‌ విజయకాంత్‌ పార్థివ దేహానికి అంజలి ఘటించారు.

ఇష్టమైన ప్రదేశంలోనే శాశ్వత నిద్రలోకి..
కోయంబేడులోని తన కల్యాణ మండపం అంటే విజయకాంత్‌కు ఎంతో ఇష్టం. పార్టీ ఆవిర్భావంతో దీనిని డీఎండీకే ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు, వ్యవహారాలు జరిగేవి. ఇక్కడకు వచ్చే కార్యకర్తలకు ఎల్లవేళలా కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు. తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించే వారు. గతంలో రాజకీయ కారణాలతో ఈ కల్యాణ మండపం కొంత భాగం వంతెన కోసం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చినా, దీనిని ఆయన వదులుకోలేదు. ప్రస్తుతం ఆయన ఇక్కడే శాశ్వత నిద్రలో సమాధి రూపంలో ఉండబోతున్నారు. ఈ కార్యాలయం ఆవరణలోనే ఆయన్ని ఖననం చేయనున్నారు. శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

కన్నీటి సంద్రంలో..
డీఎండీకే కార్యాలయంలో ఉంచిన విజయకాంత్‌ పార్థివదేహాన్ని కడసారి దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు కదిలి వస్తున్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న సమాచారంతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. రాష్ట్రంలోని తమ కార్యాలయాలలో పార్టీ జెండాను అవనతం చేశారు. విజయకాంత్‌ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

చదవండి:  'ప్రేమమ్' దర్శకుడు షాకింగ్ పోస్ట్.. ఏకంగా సీఎం కొడుక్కి అలా!

>
మరిన్ని వార్తలు