Chiranjeevi: చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. మెగాస్టార్‌ పోస్ట్‌ వైరల్‌

2 Oct, 2023 14:07 IST|Sakshi

అక్టోబర్‌ 2.. గాంధీ జయంతి. స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహానుభావుడు మహాత్మ పుట్టినరోజు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్‌.. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌(CCT) స్థాపించి ఎంతోమందికి రక్తదానం చేశారు. ఈ ట్రస్ట్‌ కార్యకలాపాలు మొదలై నేటికి పాతికేళ్లు పూర్తి కావడంతో చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. 'ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభమైంది. 25 సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది.

10 లక్షలకు పైగా బ్లడ్‌ యూనిట్స్ సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశాం. 10 వేల మందికి పైగా కంటిచూపు ప్రసాదించాం. కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడాం. తోటి మానవులకు సేవ చేయడం ద్వారా వచ్చే సంతృప్తిని మాటల్లో వెలకట్టలేం. CCT చేపట్టిన మానవతా కార్యక్రమాల్లో భాగమైన లక్షలాది మంది సోదర సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. మన దేశానికి చేస్తున్న చిరు సాయం ఇది! ఇదే మహాత్ముడికి మనం సమర్పించే అసలైన నివాళి!' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు తాను రక్తదానం చేస్తున్న ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. చిరు మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తోటివారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ ట్రస్ట్‌ను 1998 అక్టోబర్‌ 2న స్థాపించాడు.

చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్‌, ప్రియుడు ఎమోషనల్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు