ఆ చిత్రం నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్: చిరంజీవి

28 Oct, 2023 15:44 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఖైదీ’. 1983లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి.. చిరంజీవిని స్టార్‌ హీరోగా మార్చింది. హాలీవుడ్‌ చిత్రం ‘ఫస్ట్‌ బ్లడ్‌’ ఆధారంగా కోదండరామిరెడ్డి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో సంచలనాలు సృష్టించింది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూలు రాబట్టింది. దీంతో ఇండస్ట్రీలో చిరంజీవి ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత చిరంజీవికి వరుస సినిమాలు వచ్చాయి. కెరీర్‌లో ఎన్ని సూపర్‌ హిట్స్‌ వచ్చిన చిరంజీవికి ఖైదీ ఎప్పుడూ స్పెషల్‌ చిత్రమే . ఈ  మూవీ విడుదలైన నేటికి 40 ఏళ్లు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ఎక్స్‌(ట్విటర్‌)లో స్పెషల్‌ పోస్ట్‌ పెట్టాడు. 

‘'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ'ని  చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని  ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ , ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని,  నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని  అభినందిస్తూ, అంత గొప్ప  విజయాన్ని  మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.  చిరంజీవి ప్రస్తుతం ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు