G Nageswara Reddy: అదేదో ముందే అడగాల్సింది, కానీ విశ్వక్‌ సేన్‌ చేసింది తప్పే!

9 Nov, 2022 18:11 IST|Sakshi

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా- యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ల వివాదం చర్చనీయాంశంగా మారింది. తన కూతురు ఐశ్వర్యను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ అర్జున్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో విశ్వక్‌ హీరో! ఇప్పటికే అర్జున్‌ డైరెక్షన్‌లో రెండు షెడ్యూళ్ల షూటింగ్‌ కూడా పూర్తైంది. కానీ ఇంతలోనే సడన్‌గా సినిమా చిత్రీకరణను నిలిపేశారు. విశ్వక్‌ సేన్‌ షూటింగ్‌ హాజరు కాకుండా ఇబ్బంది పెడుతున్నాడని అర్జున్‌.. తన అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే షూటింగ్‌ ఆపమన్నానంటూ విశ్వక్‌ బాహాటంగా విమర్శలు గుప్పించుకున్నారు.

తాజాగా ఈ వివాదంపై ప్రముఖ దర్శకుడు జీ నాగేశ్వర రెడ్డి స్పందించాడు. 'కథ చెప్పకుండా సినిమా షూటింగ్‌ జరగదు. అయితే పక్కనుండే వాళ్లు కథ బాగోలేదు, కెరీర్‌లో ఇలాంటి సినిమా సెలక్ట్‌ చేసుకోవడం ఎందుకు అని చెప్పినప్పుడు కచ్చితంగా మైండ్‌ డిస్టర్బ్‌ అవుతుంది. కానీ విశ్వక్‌ సేన్‌ సొంత టాలెంట్‌తో పైకి వచ్చినవాడు. అతడంత ఆలోచనారహితంగా పని చేశాడనుకోను. కథ వినుంటాడు, నచ్చే ఉంటుంది. మరోపక్క అర్జున సూపర్‌ హిట్స్‌ అందించిన డైరెక్టర్‌. కథ చెప్పేశా కదా అని అర్జున్‌ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయుంటాడు.

ఈ జనరేషన్‌ హీరోలెలా ఉన్నారంటే ఏం జరుగుతుందో మొత్తం మాకు తెలియాలంటున్నారు. అవసరమైతే కథ ట్రీట్‌మెంట్‌లో కూడా కూర్చుంటున్నారు. మొత్తం 70 సీన్లు చెప్పాక షూటింగ్‌ మొదలుపెట్టుకుందామని విశ్వక్‌ ముందే అడిగి ఉంటే సరిపోయేది. అలా కాకుండా షూటింగ్‌ ఆపమని చెప్పడం కరెక్ట్‌ కాదు. ఈ విషయంలో హీరోదే తప్పు. ఇకపోతే ఈ విషయంలో అర్జున్‌ మీడియా ముందుకు రావడం, దానికి విశ్వక్‌ వివరణ ఇచ్చుకోవడం రెండు సరైనవే. ఒక్కోసారి మన చుట్టూ ఉండే మనుషుల వల్లే సమస్యలు వస్తాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇద్దరూ డైరెక్ట్‌గా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లమ్స్‌ ఉండవు' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: అర్జున్‌ సర్జా- విశ్వక్‌ సేన్‌ వివాదం.. తెరపైకి యంగ్‌ హీరో
 

మరిన్ని వార్తలు