నెల్సన్‌ నెక్ట్స్‌ ఏంటి.. జైలర్‌ తర్వాత ప్లాన్‌ ఇదేనా?

30 Oct, 2023 06:39 IST|Sakshi

ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో కోలమావు కోకిల, విజయ్‌హీరోగా బీస్ట్‌, ఇటీవల రజనీకాంత్‌ కథానాయకుడిగా జైలర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు నెల్సన్‌. కాగా జైలర్‌ చిత్రం విడుదలై 100 రోజులు కావస్తోంది. దీంతో సహజంగానే నెల్సన్‌ చేయబోయే నెక్ట్స్‌ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో అలాంటి చర్చే జరుగుతోంది. అయితే నెల్సన్‌ తాజా చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆయన ఒక కమర్షియల్‌ అంశాలతో కూడిన కథను సిద్ధం చేస్తున్నట్లు, ఇందులో నటుడు ధనుష్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

ధనుష్‌ ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని తరువాత తెలుగు, హిందీ చిత్రాలు అంటూ వరుసగా కమిట్‌ ఇస్తారని టాక్‌. దీంతో దర్శకుడు మరో ఆప్షన్‌ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఒకవేళ ధనుష్‌ కాల్‌షీట్స్‌ లభించకపోతే లేడీ సూపర్‌స్టార్‌ నయనతారతో చిత్రం చేయాలని భావిస్తున్నారట.

ఈ బ్యూటీ కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి నెల్సన్‌ దర్శకత్వంలో నటించడానికి నయనతార గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా అనేది చూడాలి. ఏదేమైనా దర్శకుడు నెల్సన్‌ తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారన్నది గమనార్హం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడానికి ఇంకొంచెం సమయం పడుతుంది.

మరిన్ని వార్తలు