బోల్డ్‌ సీన్లు: అస్సలు కుదరదంటున్న నటి!

28 May, 2021 15:45 IST|Sakshi

నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాక ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయాల్సిందే. గ్లామర్‌, డీగ్లామర్‌, ఛాలెంజింగ్‌.. ఇలా అన్నిరకాల పాత్రలను అంగీకరించి తీరాల్సిందే. ప్రేక్షకుల మనసు దోచుకోవాలంటే జనాలు మెచ్చే సినిమాలు చేయాల్సిందే! అయితే ఎలాంటి సన్నివేశంలోనైనా అలవోకగా నటించే హీరోయిన్లు బోల్డ్‌ సీన్లు వచ్చేసరికి మాత్రం ఇబ్బంది పడుతుంటారు. బుల్లితెర నటి ఎరికా ఫెర్నాండేజ్‌ కూడా అందుకు అతీతం కాదు.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీల్‌ అవుతానని పేర్కొంది. తనకు ఇప్పటివరకు అలాంటి పాత్రలు చాలా తక్కువగా వచ్చాయని, వాటిలో చాలామటుకు నో చెప్పానని తెలిపింది. కొన్ని బోల్డ్‌ సన్నివేశాలను కావాలని బలవంతంగా చొప్పిస్తారని, అలాంటప్పుడు ఆ సీన్లలో నటించేందుకు నిరభ్యంతరంగా తిరస్కరిస్తానని స్పష్టం చేసింది. 

'ఆ బోల్డ్‌ సన్నివేశం ఎందుకు అవసరమనేది ముందు నాకు క్లారిటీ ఇవ్వాలి. నిజంగానే అది తప్పనిసరి అనిపించినప్పుడు మాత్రమే అందులో నటించేందుకు నేను మానసికంగా సిద్ధమవుతాను. అంతేకానీ కథ డిమాండ్‌ చేయకపోయినా అలాంటి సన్నివేశాల్లో నటించాల్సిందే అంటే అందుకు అస్సలు ఒప్పుకోను' అని నటి తేల్చి చెప్పింది.

కాగా 'కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ'తో బుల్లితెర మీద తన ప్రయాణం మొదలు పెట్టింది ఎరికా ఫెర్నాండేజ్‌. దీనికి కొనసాగింపుగా వచ్చిన రెండో సీజన్‌లోనూ ఎరికానే నటించింది. 2018లో ప్రారంభమైన కసౌటీ జిందగీ కే 2వ సీజన్‌లోనూ తన నటనతో మెప్పించింది.

చదవండి: బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్‌' మూవీ

ఆ డబ్బులు తీసుకోమన్నా వినలేదు: యాంకర్‌ ఝాన్సీ

మరిన్ని వార్తలు