Chandra Mohan Death: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్‌ కన్నుమూత

11 Nov, 2023 10:23 IST|Sakshi

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్‌ చేయించుకుంటున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లో సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబ నేపథ్యం..
చంద్రశేఖర్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945  మే 23న జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు. 

(చదవండి: చంద్రమోహన్‌ మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి)

సినిమా నేపథ్యం..
చంద్రమోహన్‌ 1966లో రంగుల రాట్నం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో చందమామ రావే చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. పదహారేళ్ల వయసు సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. రంగుల రాట్నం, పదహారేళ్ల వయసు, సీతామహాలక్ష్మి, రాధాకల్యాణం, రెండు రెళ్ల ఆరు, చందమామ రావే, రామ్‌ రాబర్ట్ రహీమ్‌ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు.

ఆ సినిమాలు తన కెరీర్‌లోనే స్పెషల్‌
సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినన్న చంద్రమోహన్‌ ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వోద్యోగానికి వెళ్లాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో సిరిసిరిమువ్వ, శుభోదయం, సీతామహాలక్ష్మి, పదహారేళ్ల వయసు చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు.

ఇదీ చదవండి: చంద్రమోహన్‌ మృతికి కారణాలివే!

లక్కీ హీరోగా క్రెడిట్‌
ఒకప్పుడు హీరోయిన్లకు ఈయన లక్కీ హీరో. చంద్రమోహన్‌తో నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి, జయసుధ, జయప్రద.. ఈయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌- సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. ఈయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు