విశాల్‌ అలా అనడం కూడా సనాతనమే : నిర్మాత

27 Sep, 2023 10:28 IST|Sakshi

తమిళసినిమా: సనాతనం గురించి రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా నటుడు విశాల్‌ చేసిన వ్యాఖ్యలు మరో రకం సనాతనం అని నిర్మాత, నటుడు కార్తికేయన్‌ వెంకట్రామన్‌ అన్నారు. ఈయన అంగ్రి ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్షన్‌ ఎల్‌ఏల్‌పీ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం ఎనక్కు ఎండే కిడైయాదు. నూతన దర్శకుడు విక్రమ్‌ రమేష్‌ కథా, కథనం, దర్శకత్వం వహిస్తూ కథానాయికుడిగా నటిస్తున్న ఇందులో నటి స్వయం సిద్ధా నాయకిగా నటించారు. దళపతి రత్నం ఛాయాగ్రహణం, కళాచరణ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్‌ 6వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం చిత్రం ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, నటుడు కార్తికేయన్‌ వెంకట్రామన్‌ మాట్లాడుతూ తాను స్వతహాగా న్యాయవాదినని, అయితే సినిమాపై ఆసక్తితోనే నటుడినవ్వాలని థియేటర్‌ ఆర్టిస్టుగా శిక్షణ పొందినట్లు తెలిపారు. విక్రమ్‌ రమేష్‌ చెప్పిన కథ నచ్చడంతో చిత్ర నిర్మాణం చేపట్టానని, పలు సమస్యలకు ఎదురొడ్డి నిలిచి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు యువకుల మధ్య చిన్న పోరాటమే ఈ చిత్ర కథ అని తెలిపారు. కాగా ఇటీవలి కాలంలో నటుడు విశాల్‌ మూడు నాలుగు కోట్ల రూపాయలతో చిత్రం చేద్దామంటూ కొందరు వస్తున్నారని, అలా ఎవరూ రావద్దని అనడం కూడా ఒక రకమైన సనాతనమే అని అభిప్రాయపడ్డారు. ఇక్కడ అలా చెప్పే హక్కు ఎవరికీ లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు