Farah Khan: నటించకపోతే చచ్చిపోతాననుకుంటే రండి: బాలీవుడ్‌ డైరెక్టర్‌

10 Feb, 2023 10:45 IST|Sakshi

తిరస్కరణను అంగీకరించడంతో పాటు నిజమైన ప్రతిభ, నమ్మకం ఉన్న వారే బాలీవుడ్‌ను ఎంచుకోవాలని బాలీవుడ్‌ దర్శకురాలు ఫరా ఖాన్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఫిక్కి ఎఫ్‌ఎన్‌ఓ ఆధ్వర్యంలో ది ఫోర్స్‌ ఆఫ్‌ ఫిమేల్‌ ఫార్టిట్యూట్‌ పేరుతో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలీవుడ్‌ను కేరీర్‌గా ఎంచుకోవాలని లక్షలాది మంది కోరుకుంటారన్నారు. అయితే తాను వద్దని చెప్పడానికి చాలా కారణాలున్నాయని, నిజంగా ఈ రంగంలోకి రావాలని ఆశించే వారు చాలా ఓపికతో ఉండాలన్నారు. ప్రతిభ ఉండి, మీపైన మీకు నమ్మకం ఉండి, మీరు నటించకపోతే చనిపోతారని భావిస్తే మాత్రమే ఈ రంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు.

హైదరాబాద్‌ తనకు ఎంతో ప్రత్యేకమని, తాను తరచూ ఇక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటారన్నారు. దర్శకుల విషయంలో లింగ భేదం, పక్షపాతం ఉండదని, బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన మహిళా దర్శకురాలిగా తాను చేసిన ప్రయాణాన్ని వివరించారు. తాను కూడా చాలామంది మాదిరిగానే చిన్న తనంలో బాధలు, కష్టాలు, ఇబ్బందులు చూశానన్నారు. శుక్రవారాలు పరిశ్రమలోని చాలామంది కళాకారుల భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, తన తండ్రి సినిమా విడుదలవుతున్న శుక్రవారాల్లో ముందు చాలా మంది మెచ్చుకుని, చిత్రం విడుదలైన రెండు రోజుల తర్వాత ఆదివారం ప్రజలు అతడిని చూడటం, ఇంటికి రావడం మానేశారన్నారు.

తమ జీవితాలు ఇలాగే ఉంటాయని వివరించారు. బాలీవుడ్‌లో తమ కేరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టెక్నిక్, నైపుణ్యం, అర్హత లేదా ప్రతిభ వీటిలో ఏది ముఖ్యమని ఫిక్కీ సభ్యులు అడిగినప్పుడు ఫరాఖాన్‌తో పాటు సినీ నటులు పూజా హెగ్డే, అడవి శేష్‌ ఈ మూడూ అవసరమని సమాధానం చెప్పారు. సహజమైన ప్రతిభ కలిగి ఉండటం మంచిదని, నైపుణ్యాలనూ ప్రదర్శించాలని ఫరాఖాన్‌ అన్నారు. దర్శకత్వం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. సినీ ప్రముఖులు అడవి శేష్‌, పూజా హెగ్డే, ఫిక్కీ ఎఫ్‌ ఏఓ హైదరాబాద్‌ చైర్‌పర్సన్‌ భుభా మహేశ్వరి, పింకీరెడ్డి, దాదాపు 300 మంది ఫిక్కీ సభ్యులు పాల్గొన్నారు.

చదవండి: పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతున్న హీరోయిన్‌

మరిన్ని వార్తలు