గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా?

12 Feb, 2021 00:37 IST|Sakshi
సత్యదేవ్, ఐశ్వర్యా లక్ష్మీ

‘‘కరోనా తర్వాత మా ‘గాడ్సే’ సినిమా ఆరంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా బ్యానర్లో నిర్మిస్తోన్న 80వ చిత్రం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే వంద సినిమాలు పూర్తి చేస్తాం’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్‌. సత్యదేవ్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా గోపీ గణేష్‌ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్సే’. సీకే స్క్రీన్స్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘తల్లితండ్రులు, యువకులు ఆలోచించే విధంగా చదువు నేపథ్యంలో ‘గాడ్సే’ చిత్రాన్ని గొప్పగా తెరకెక్కిస్తున్నాం. గాడ్సే అన్నది మంచి పేరా? దుర్మార్గమైన పేరా? అనేది మా చిత్రంలో చూపించబోతున్నాం.

సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేసి, జూన్‌ లేదా జూలై నెలలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సత్యతో ‘బ్లఫ్‌ మాస్టర్‌’ సినిమా చేశాను. ఇప్పుడు ‘గాడ్సే’ చేస్తున్నాను. ప్రతి దేశంలో ఉన్న, జరుగుతున్న పాయింట్‌ని టచ్‌ చేసి బిగ్‌ స్క్రీన్‌ పైకి తీసుకొస్తున్నాం’’ అన్నారు గోపీ గణేష్‌ పట్టాభి. ‘‘నా జీవితంలో ‘జ్యోతిలక్ష్మి’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చాలా ముఖ్యమైన సినిమాలు. ‘బ్లఫ్‌ మాస్టర్‌ 2’ ఎప్పుడు చేస్తున్నారు? అని చాలామంది అడుగుతున్నారు. ఆ చిత్రానికి రెండింతలు గొప్పగా ఉండే సినిమా ‘గాడ్సే’’ అన్నారు సత్యదేవ్‌. హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ, సంగీత దర్శకుడు సునీల్‌ కశ్యప్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కేయస్‌ రామారావు, నటులు ప్రకాశ్‌ నాగ్, అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు