Gurthunda Seethakalam Review: ‘గుర్తుందా శీతాకాలం’మూవీ రివ్యూ

9 Dec, 2022 13:23 IST|Sakshi
Rating:  

టైటిల్‌:  గుర్తుందా శీతాకాలం
నటీనటులు: సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి, సుహాసిని తదితరులు
నిర్మాణ సంస్థలు: వేదాక్షర ఫిల్మ్స్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: రామారావు చింతపల్లి, భావన రవి, నాగ శేఖర్
దర్శకత్వం: నాగ‌శేఖ‌ర్
సంగీతం: కాలభైరవ
సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే
ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: డిసెంబర్‌ 9 , 2022

కథేంటంటే..
ఈ కథంతా రోడ్‌ జర్నీలో పరిచమైన ఇద్దరు వ్యక్తులు దేవ్‌(సత్యదేవ్‌), దివ్య (మేఘా ఆకాష్‌) మధ్య సంభాషణగా కొనసాగుతుంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన దేవ్‌ స్కూల్‌, కాలేజీ డేస్‌లలో ఒక్కో అమ్మాయితో లవ్‌లో పడతాడు. స్కూల్‌ డేస్‌లోది అట్రాక్షన్‌. కానీ కాలేజీలో అమ్ము అలియాస్ అమృత (కావ్యా శెట్టి) ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం బెంగళూరు కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు.

అయితే అతని శాలరీ తక్కువని, ధనవంతులుగా ఉన్న మనం అలాంటి వారితో జీవితాన్ని కొనసాగించలేమని తల్లి చెప్పడంతో అమ్ము మనసు మారుతుంది. ప్రతిసారి దేవ్‌ని తక్కువ చేసి మాట్లాడుతుంది. అనేకసార్లు అవమానిస్తుంది. అయినా కూడా దేవ్‌ ఆమెను ఒక్కమాట అనడు. చివరకు ఆమే దేవ్‌కి బ్రేకప్‌ చెబుతుంది. ఆ తర్వాత దేవ్‌ జీవితంలోకి నిధి(తమన్నా) వస్తుంది. నిధిని పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి జీవితంలో జరిగిన పరిణామాలు ఏంటి? నిధికి అబార్షన్‌ ఎందుకు అయింది?  దేవ్‌ ప్రేమ, పెళ్లి విషయంలో స్నేహితులు ప్రశాంత్‌(ప్రియదర్శి), గీతుల పాత్ర ఏంటి? అసలు తన లవ్‌స్టోరీని అపరిచితురాలైన దివ్యకు ఎందుకు చెప్పాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
కన్నడలో విజయవంతమైన లవ్ మాక్‌టెయిల్ తెలుగు రీమేకే గుర్తుందా శీతాకాలం. తెలుగు నేటివిటికి తగినట్టు కొన్ని మార్పులు చేసి ఈ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని  వచ్చినా సరే.. వాటిపై ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ తగ్గదు. అయితే తెరపై చూపించే లవ్‌స్టోరీతో ప్రేక్షకుడు కనెక్ట్‌ అయితే అది వర్కౌట్‌ అవుతుంది. పాత్రల్లో లీనమైపోవాలి. కథ ఫ్రెష్‌గా ఉండాలి. అలాంటి లవ్‌స్టోరీని ఆడియన్‌  ఓన్‌ చేసుకుంటాడు. కానీ గుర్తుందా శీతాకాలంలో అది మిస్‌ అయింది. 

కొత్తదనం ఏమి కనిపించదు. హీరోకి స్కూల్‌డేస్‌.. కాలేజీ డేస్‌ లవ్‌స్టోరీ ఉండడం.. వాటిని నెమరేసుకోవడం ..ఈ తరహా కథలు తెలుగు ఆడియన్స్‌కు కొత్తేమి కాదు. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్', 'ప్రేమమ్’ సినిమాల మాదిరి కథనం సాగుతుంది. ఫస్టాఫ్‌లో వచ్చే స్కూల్‌ డేస్‌, కాలేజీ డేస్‌ సీన్స్‌ నవ్విస్తాయి. అయితే కథనం మాత్రం ఊహకందేలా నెమ్మదిగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో సత్యదేవ్‌, తమన్నాల మధ్య జరిగే సీన్స్‌ ఆకట్టుకునేలా ఉంటాయి. బలమైన సన్నివేశాలు ఏవి లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్‌. ప్రేమ కథా చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా ప్రధాన బలం సత్యదేవ్‌ అనే చెప్పాలి. దేవ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై ఓ కొత్త సత్యదేవ్‌ని చూస్తాం. రకరకాల వేరియేషన్స్‌ని బాగా పండించాడు. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్స్‌లో సత్యదేవ్‌ నటన బాగుంటుంది.  నిధి పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కగా నటించింది.  సత్యదేవ్‌ ప్రియురాలు, డబ్బున్న అమ్మాయి అమృత పాత్రకి కావ్యా శెట్టి న్యాయం చేసింది.

హీరో స్నేహితుడు ప్రశాంత్‌గా ప్రియదర్శి తనదైన కామెడీతో నవ్విస్తూనే.. కథకు సపోర్ట్‌గా నిలిచాడు. మేఘా ఆకాష్, సుహాసిని మణిరత్నంతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కాలభైరవ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్‌ అయింది.  లక్ష్మీ భూపాల మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

-అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.5/5)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు