Ghost Review : కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఘోస్ట్‌’ ఎలా ఉందంటే..

4 Nov, 2023 17:28 IST|Sakshi
Rating:  

టైటిల్‌: ఘోస్ట్‌ 
నటీనటులు: శివరాజ్‌ కుమార్‌, జయరామ్‌, అనుపమ్‌ ఖేర్‌, అర్చనా జాయిస్‌, ప్రశాంత్‌ నారాయణన్‌, సత్య ప్రకాశ్‌, అభిజీత్‌ తదితరులు
నిర్మాత: సందేశ్‌ నాగరాజ్‌
దర్శకత్వం: ఎంజీ శ్రీనివాస్‌
సంగీతం: అర్జున్‌ జన్యా
సినిమాటోగ్రఫీ: మహేంద్ర సింహా
విడుదల తేది: నవంబర్‌ 4, 2023

కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌కి తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. పలు తెలుగు సినిమాల్లో అతిథి పాత్ర చేశారు. ఇటీవల రజనీకాంత్‌ ‘జైలర్‌’లో కూడా మెరిశాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఘోస్ట్‌’. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 19న కన్నడలో రిలీజైన ఈ చిత్రం..నేడు(నవంబర్‌ 3) అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 


కథేంటంటే..
వామన్‌ శ్రీనివాస్‌(ప్రశాంత్‌ నారాయణన్‌) సీబీఐ మాజీ అధికారి. పదేళ్లుగా పోరాటం చేసి జైళ్ల ప్రైవేటీకరణ బిల్లుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటాడు. భూమి పూజ చేయడానికి వెళ్లిన వామన్‌..అతన్ని మనుషులను ఓ ముఠా కిడ్నాప్‌ చేసి, అదే జైలులో ఉన్న మరో టవర్‌లో బందీ చేస్తుంది. ఈ కేసును పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రత్యేక అధికారి చరణ్‌ రాజ్‌(జయరామ్‌) రంగంలోకి దిగుతాడు. వామన్‌ గ్యాంగ్‌ని బందీ చేసింది బిగ్‌డాడీ(శివరాజ్‌ కుమార్‌)అని చరణ్‌ తెలుసుకుంటాడు. అసలు బిగ్‌డాడీ ఎవరు? జైలులోనే వామన్‌ని ఎలా కిడ్నాప్‌ చేశాడు? ఎందుకు చేశాడు? జైలులో ఉన్న 1000 కేజీల బంగారం కథేంటి?  ఈ కథలో అనుపమ్‌ ఖేర్‌ పోషించిన పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఘోస్ట్‌ చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
కేజీయఫ్‌ తర్వాత గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రాలు ఎక్కువ అయ్యాయి. టాలీవుడ్‌లోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలోనూన ఈ తరహా చిత్రాలే వస్తున్నాయి. ఘోస్ట్‌ కూడా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రమే. చివరల్లో స్పై థ్రిల్లర్‌ టచ్‌ ఇచ్చారు అంతే. కథ, కథనాలను పట్టించుకోవకుండా.. కేవలం మాస్‌ ఎలివేషన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అనిపిస్తుంది.

కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలు మధ్యలో ఓ సీబీఐ మాజీ అధికారిని హీరో గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేయడం.. అతన్ని అడ్డుగా పెట్టుకొని ప్రభుత్వంతో తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం.. క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమా కథ ఇంతే. అయితే ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా ఉండాలి. పోలీసులకు, హీరో గ్యాంగ్‌ మధ్య జరిగే వార్‌తో పాటు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆడే మైండ్‌ గేమ్‌.. చాలా ఉత్కంఠ భరితంగా అనిపించాలి. కానీ ఘోస్ట్‌ విషయం అది మిస్‌ అయింది. ప్రతిసారి కథ పదేళ్ల వెనక్కి వెళ్లడం..మళ్లీ ప్రస్తుతానికి రావడం.. ఇబ్బందికరంగా మారుతుంది. శివరాజ్‌కుమార్‌ని ఎలివేట్‌ చేసే సీన్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ని అలరిస్తాయి. 

వామన్‌ను బిగ్‌డాడీ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేసే భారీ యాక్షన్‌ సీన్‌తో కథ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రత్యేక అధికారి చరణ్‌ రాజ్‌ రంగంలోకి దిగాక కథలో వేగం పుంజుకుంటుంది. అయితే పోలీసులకు, హీరో గ్యాంగ్‌కు మధ్య జరిగే మైండ్‌ గేమ్‌ అంత ఆసక్తికరంగా సాగదు. ప్రధాన పాత్రల ఫ్లాష్‌ బ్యాక్‌ని కొంచెం కొంచెంగా చూపిస్తూ..  అసలు విషయం ఏంటో చెప్పకుండా గందరగోళానికి గురిచేశారు. కథంతా జైలు గోడమధ్యే తిరుగుతూ.. ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. పైగా మహిళా జర్నలిస్ట్‌.. ఆమె తండ్రికి మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా..అనవసరం అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. 

బిగ్‌డాడీ నేపథ్యం ఏంటి?  వామన్‌ని ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? జైలులో ఉన్న 1000 కేజీల బంగారంతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలన్నీంటికి  సెకండాఫ్‌లో సమాధానం దొరుకుంది. అయితే ద్వితియార్థంలో కూడా హీరోని ఎలివేట్‌ చేసే సన్నివేశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి కొడుకుని హీరో చంపేసే సీన్‌  ఆసక్తికరంగా ఉంటుంది.  ఫ్లాష్‌బ్యాక్‌లో చరణ్‌ రాజ్‌కు బిగ్‌డాడీ ఇచ్చే వార్నింగ్‌ సీన్‌ కూడా అదిరిపోతుంది. యాక్షన్‌ పరంగా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. కానీ కథ,కథనంలో పసలేదు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ కథకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. సీక్వెల్‌ కోసమే అనట్లుగా పలు ప్రశ్నలు లేవనెత్తి.. అసంతృప్తిగా సినిమాను ముగించారు. 

ఎవరెలా చేశారంటే..
ఇది పక్కా శివరాజ్‌ కుమార్‌ చిత్రం. దర్శకుడు ఆయనను దృష్టిలో పెట్టుకొనే కథను రాసుకుని ఉంటాడు. కొన్ని స్టైలీష్‌ యాక్షన్‌ సీన్స్‌ చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తూ యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేశాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. సినిమా క్లైమాక్స్‌లో టెక్నాలజీ ద్వారా శివరాజ్‌ని యంగ్‌గా చూపించడం అభిమానులను అలరిస్తుంది. పోలీసు అధికారి చరణ్‌రాజ్‌ పాత్రలో జయరామ్‌ ఒదిగిపోయాడు.. వామన్ శ్రీనివాసన్ పాత్రలో ప్రశాంత్ నారాయణన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.  సాంకేతిక విషయాలకొస్తే.. అర్జున్‌ జన్యా నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో  హీరోయిజాన్ని ఎలివేట్‌ చేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

Rating:  
(2/5)
మరిన్ని వార్తలు