New Directors-Hit Movies: సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి హిట్‌ కొట్టిన డైరెక్టర్స్‌ వీళ్లే

10 Dec, 2022 08:45 IST|Sakshi

ప్రతి ఏడాది కొత్త దర్శకులు పరిచయం అవుతుంటారు. ఈ ఏడాది కూడా కొత్త డైరెక్టర్లు వచ్చారు. దాదాపు పదిహేనుకు పైగా కొత్త దర్శకులు వస్తే.. అందులో హిట్‌ బొమ్మ (సినిమా) ఇచ్చిన దర్శకులు ఎక్కువగానే ఉన్నారు. ఇలా హిట్‌ డైరెక్షన్‌తో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ల గురించి తెలుసుకుందాం.

డీజే సౌండ్‌ అదిరింది
ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవానికి రెండు రోజుల ముందు వచ్చిన ‘డీజే టిల్లు’ చిత్రం అద్భుతమైన విజయం సాధించింది. టైటిల్‌ రోల్‌లో సిద్ధు జొన్నలగడ్డ నటించగా, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ పాత్రను నేహా శెట్టి చేశారు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంతో విమల్‌ కృష్ణ దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ చిత్రంలోని ‘డీజే టిల్లు’ టైటిల్‌ సాంగ్, ‘పటాస్‌ పిల్ల’ పాటలు శ్రోతలను ఊర్రూతలూగించాయి. ఈ డీజే హిట్‌ సౌండ్‌ ఇచ్చిన కిక్‌తో సీక్వెల్‌గా ‘డీజేటిల్లు స్వై్కర్‌’ను తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి  మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

పసందైన కళ్యాణం
‘రాజావారు రాణిగారు, అద్భుతం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్‌ సేన్‌కు ఈ సినిమాతో క్లాస్‌ ఇమేజ్‌ తెప్పించారు విద్యాసాగర్‌. ఇందులో రుక్సార్‌ థిల్లాన్‌ హీరోయిన్‌. ‘రాజావారు రాణిగారు’ చిత్రానికి దర్శకత్వం వహించిన రవికిరణ్‌ కోల ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే ఇచ్చి షో రన్నర్‌గా వ్యవహరించారు. భోగవల్లి బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మించిన ఈ ‘అర్జున కళ్యాణం’ మే 6న విడుదలై, ప్రేక్షకులకు పసందైన అనుభూతినిచ్చింది. 

కలెక్షన్‌ కింగ్‌
కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం ‘బింబిసార’. ఈ హిట్‌ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు వశిష్ఠ. రాజుల కాలం, ప్రస్తుత కాలం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్‌ కింగ్‌ అనిపించుకుంది. ఇక ‘బింబిసార– 2’ కూడా ఉండొచ్చనే హింట్‌ ఇచ్చారు వశిష్ఠ. నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా కె. హరికృష్ణ నిర్మించిన ‘బింబిసార’ ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైంది. 

డబుల్‌ ధమాకా
తెలుగు, తమిళ ప్రేక్షకుల మెప్పును ఒకే సినిమాతో పొందిన డబుల్‌ ధమాకా శ్రీకార్తీక్‌ దక్కింది. శర్వానంద్‌ హీరోగా అక్కినేని అమల, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీకార్తీక్‌ దర్శకుడు. సెప్టెంబరు 9న ఈ సినిమా విడుదలైంది. తల్లీకొడుకుల సెంటిమెంట్‌కు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ మిళితం చేసి ప్రేక్షకులను అలరించారు శ్రీకార్తీక్‌. 

మంచి ముత్యం
సరోగసీ కాన్సెప్ట్‌తో వినోదాత్మకంగా ‘స్వాతి ముత్యం’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల మెప్పు పొందారు దర్శకుడు లక్ష్మణ్‌ కె. కృష్ణ. ‘సదా నీ ప్రేమలో..’ అనే ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ తర్వాత లక్ష్మణ్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘స్వాతి ముత్యం’.  సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమాతో లక్ష్మణ్‌ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయం అయితే హీరో బెల్లంకొండ గణేష్‌కు కూడా ఇది తొలి చిత్రమే. వీరిద్దరూ మంచి ముత్యంలాంటి సినిమా ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అక్కడ హిట్‌.. ఇక్కడా హిట్టే...
‘ఓ మై కడవులే’ (2020)తో తమిళ పరిశ్రమకు దర్శకునిగా పరిచయమయ్యారు అశ్వత్‌ మారిముత్తు. ఇదే సినిమా రీమేక్‌ ‘ఓరి.. దేవుడా’తోనే తెలుగులోనూ దర్శకునిగా పరిచయం అయ్యారు అశ్వత్‌. ‘ఓరి.. దేవుడా..’ కూడా ఓ మాదిరి హిట్‌గా నిలిచింది. ఇందులో  విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా, వెంకటేశ్‌ కీలక పాత్ర చేశారు. అక్టోబరు 21న విడుదలైన ఈ చిత్రానికి ‘దిల్‌’ రాజు, పరమ్‌ వి. పొట్లూరి, పెరల్‌ వి. పొట్లూరి నిర్మాతలు. 

థ్రిల్లింగ్‌ హిట్‌
‘అంబులి’ సినిమాతో తమిళ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు దర్శక–ద్వయం హరి శంకర్‌–హరీష్‌ నారాయణ్‌. ఈ ఇద్దరూ తెరకెక్కించిన ‘యశోద’ గత నెల రిలీజై, హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సమంత టైటిల్‌ రోల్‌లో, వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీతో తెలుగుకు దర్శకులుగా పరిచయం అయ్యారు హరి–హరీష్‌. సరోగసీ నేపథ్యంలో జరిగే క్రైమ్స్‌ నేపథ్యంలో శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 11న విడుదలై, థ్రిల్లింగ్‌ హిట్‌ ఇచ్చింది. 

హిట్‌ హారర్‌
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల జాబితాలో ‘మసూద’ ఉంది. సూపర్‌ నేచురల్‌ హారర్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకి సాయికిరణ్‌ దర్శకుడు. సంగీత, తీరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, ‘శుభలేఖ’ సుధాకర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించిన ఈ చిత్రం నవంబరు 18న విడుదలైంది.

ఇంకొందరు... 
రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ తో శరత్‌ మండవ (తెలుగులో శరత్‌కు తొలి చిత్రం) వరుణ్‌ తేజ్‌ బాక్సింగ్‌ డ్రామా ‘గని’తో కిరణ్‌ కొర్రపాటి, నితిన్‌ పొలిటికల్‌ డ్రామా ‘మాచర్ల నియోజకవర్గం’ తో ఎమ్‌ఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, శ్రీ విష్ణు ‘అల్లూరి’ తో ప్రదీప్‌వర్మ, ‘టెన్త్‌క్లాస్‌ డైరీస్‌’తో సినిమాటోగ్రాఫర్‌ అంజి, సుమ కనకాల ‘జయమ్మ పంచాయితీ’ తో విజయ్‌కుమార్‌ కలివరపు, హర్ష్‌ కనుమిల్లి ‘సెహరి’తో జ్ఞానశేఖర్‌ ద్వారక, రాజ్‌తరుణ్‌ ‘స్టాండప్‌ రాహుల్‌’తో శాంటో, వైష్ణవ్‌ తేజ్‌ ‘రంగరంగ వైభవంగా..’తో గిరీశాయ (తెలుగులో...), ‘ముఖచిత్రం’ సినిమాతో గంగాధర్‌ వంటి దర్శకులు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేశారు.  

మరిన్ని వార్తలు