పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు రిషబ్‌ శెట్టి అడుగులు

20 Dec, 2023 10:39 IST|Sakshi

నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి 'కాంతార'తో యావత్తు సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ సినిమా ఘనవిజయం తర్వాత ఆయన పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొదటి భాగం హిట్‌ కొట్టడంతో 'కాంతార ఏ లెజెండ్‌: ఛాప్టర్‌ 1' ప్రీక్వెల్‌ కూడా త్వరలో రానుంది. 54వ 'ఇఫి' వేడుకలో 'కాంతార'కు సిల్వర్‌ పీకాక్‌ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రం ఇదేనని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేసింది.

ఈ సినిమా విజయంతో ఆయన ఒక పౌండేషన్‌ను ఏర్పాడు చేశాడు. ఇందులో భాగంగ తన సొంత గ్రామానికి తనకు చేతనైన సాయం చేయాలని ముందుకు వచ్చాడు. దక్షిణ కర్ణాటకలోని కెరటి గ్రామానికి చెందిన వ్యక్తి రిషబ్ శెట్టి. సినిమా వల్ల ప్రస్తుతం ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నాడు. దీంతో తను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. శెట్టి ఫౌండేషన్‌ ద్వారా తన సొంత గ్రామంలో ఉండే పాఠశాలకు సహాయాన్ని అందించాడని సమాచారం.  కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట.

దీని ద్వారా కనీస అవసరాలే లేని కన్నడ పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలి వంటి ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నాడట. ఇందులో మరికొందరిని భాగస్వామ్యం చేసేందుకు ఆయన చూస్తున్నారట. ఇందులో భాగంగా తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలను తాజాగా రిషబ్‌ సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఆయన ప్రాథమిక చర్చ జరిపారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. త్వరలో ఆయన ఈ విషయంపై క్లారటీ ఇస్తారని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు