ఎన్నికల్లో వారి తరపున ప్రచారం చేస్తా: కంగనా

5 Dec, 2021 14:37 IST|Sakshi

Kangana Ranaut Clarifies On Which Party She Supports: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదస్పద వ‍్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తుంటారు. ఎక్కువగా బీజేపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతారు. దీంతో కంగనా త్వరలోనే బీజేపీలో చేరుతుందని పుకార్లు కూడా వినిపించాయి. కానీ కంగనా మాత్రం ఆ పుకార్లను కొట్టిపారేసింది. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేసింది.

శనివారం ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా?అని విలేకర్లు ప్రశ్నించగా.. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని చెప్పింది. కానీ జాతీయవాదుల తరపున ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకృష్ణ జన్మస్థలం పక్కన ఈద్గా ఉందని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చర్యలు చేపట్టి అసలైన పుణ్యస్థలాన్ని ప్రజలకు చూపిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన ప్రకటన వల్ల కొంతమంది మనోభావాలను దెబ్బతింటాయని, కానీ నిజాయితీపరులు, ధైర్యవంతులు, జాతీయవాదులు మాత్రం తాను.చెప్పింది సరైనది అని గుర్తిస్తారని చెప్పారు. చండీగఢ్‌లో తన కారును రైతులు అడ్డుకున్నారనే వార్తలపై స్పందిస్తూ ‘నేను ఎప్పుడూ క్షమాపణలు చెప్పలేదు. దాన్ని తీవ్రంగా ఖండించాను" అని అన్నారు.

మరిన్ని వార్తలు