థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న వారు తెలుగువారు మాత్రమే: త్రివిక్రమ్‌

25 Aug, 2021 00:40 IST|Sakshi
దర్శన్, హరీష్, మీనాక్షి, సుశాంత్, త్రివిక్రమ్, వెంకట్‌

‘నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి... తెలుగుజాతి మాత్రమే. ‘ఇలా లాంచ్‌ అవ్వాలి.. ఇలాంటి సినిమాలు’ చేయాలనే చట్రంలో సుశాంత్‌ ఇరుక్కుపోయాడా? అనే ఫీలింగ్‌ నాకు ఉండేది. కానీ ‘చిలసౌ’ సినిమాతో తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఈ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయమని అడిగాను. ‘చిలసౌ’, ‘అల.. వైకుంఠపురములో...’ తర్వాత సుశాంత్‌కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అవుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ అన్నారు.

సుశాంత్, మీనాక్షి జంటగా ఎస్‌. దర్శన్‌ దర్శకత్వంలో రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో త్రివిక్రమ్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌ అంటే... సినిమా వెళుతుంటే మన ఇంటి ఆడపిల్లను వేరే ఇంటికి పంపినట్లు ఉంటుంది. కాకపోతే వేరే ఇంటికి వెళ్లి సెపరేట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చేస్తుందని ఎలా ఆడపిల్లను పంపిస్తామో... సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని థియేటర్స్‌లో, కామెడీ సీన్స్‌లో, టీవీలో, షోస్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ స్పాన్‌ పెంచుకుంటున్నప్పుడు మరింత ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అలాంటి అనుభవాలు దర్శన్‌కు ఎదురు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని ‘బండి తీయ్‌..’ పాటను ఒక్క రోజులో తీశారు. విజువల్‌గా నేను చూసినప్పుడు వాళ్లలో ఆనందం కనిపించింది. ఆ చిరునవ్వులోనే సగం సక్సెస్‌ కనిపిస్తోంది’’ అన్నారు.  

హీరో సుశాంత్‌ మాట్లాడుతూ – ‘‘త్రివిక్రమ్‌గారు చెప్పింది నిజమే. కెరీర్‌ స్టార్టింగ్‌లో..కష్టపడాలి అని తెలుసు కానీ క్లారిటీ లేదు. ఏ డైరెక్షన్‌లో వెళ్లాలో మొదట్లో అర్థం కాలేదు. రాంగ్‌ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడ్డాను. అదీ నా తప్పే. ‘చిలసౌ’ సినిమా అప్పుడు. ..‘సినిమాలు ఆడినా,ఆడకపోయినా ఇండిపెండెంట్‌గా ఉండమని’ నాగార్జున గారు సలహా ఇచ్చారు. గట్‌ ఫీలింగ్‌తో నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్‌ చేశాను. ఈ సినిమాలో దర్శన్‌ ఓ కొత్త సుశాంత్‌ను చూపించారు’’ అన్నారు. ‘‘నిర్మాతలు రవిశాస్త్రి (దివంగత నటి భానుమతిగారి మనవడు), ఏక్తాలగారిది ఒక లెగసీ, హీరో సుశాంత్‌గారిది మరో లెగసీ. వీరి కాంబినేషన్‌లో సినిమాకు అసోసియేట్‌ అవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు నిర్మాత హరీశ్‌. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్‌ ఆదిత్య, శ్రీనివాసరెడ్డి, జెమినీ కిరణ్, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు